Teeth Pain: ఉప్పు, నిమ్మకాయ, ఉల్లిపాయతో పంటినొప్పికి చెక్..!
Teeth Pain: ఒక వ్యక్తి పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు అతడు ఎటువంటి ఆహారం, పానీయాలు తీసుకోలేడు...
Teeth Pain: ఒక వ్యక్తి పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు అతడు ఎటువంటి ఆహారం, పానీయాలు తీసుకోలేడు. అయితే దంతనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాల్షియం లోపం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల జరగవచ్చు. ఉల్లితో పంటి నొప్పిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలనేది చాలా మంది ప్రశ్న.
దంతాల సమస్యను తొలగించడానికి ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం. ఉల్లిపాయ, నిమ్మకాయలను కలిపి వాడటం వల్ల అనేక దంత సమస్యలను నయం చేయవచ్చు. ఈ పరిస్థితిలో మీరు ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మరసం మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయ ముక్కలతో నొప్పి ఉన్న దగ్గర రుద్దండి. ఇలా చేయడం వల్ల మంచి ఉపశమనం పొందడమే కాకుండా పంటి నొప్పిని నయం చేసుకోవచ్చు.
పళ్లకు ఉల్లిపాయలు వాడితే దుర్వాసన వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఉల్లిపాయను ఉప్పుతో కలిపి ఉపయోగిస్తే అది దంతాలను బాగా శుభ్రం చేయడమే కాకుండా, దంతాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇక చిగుళ్ల నొప్పికి చెక్ పెట్టడానికి ఆవ నూనెలో ఒక చిటికెడు ఉప్పును కలిపి చిగుళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
లవంగాలు కూడా పంటి నొప్పికి మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక పంటి నొప్పి ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.