Boost Your Immunity: వ్యాధి నిరోధక వ్యవస్థను పెంచుకుంటే కరోనాకు చెక్
Boost Your Immunity: శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థను పెంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారికి చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Boost Your Immunity: దేశ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తోంది. రెండో దశలో కరోనావైరస్ కనికరం లేకుండా కాటేస్తోంది. శ్వాసవ్యవస్థ మీద దెబ్బకొట్టి.. రోగుల ఉసురుతీస్తోంది. ఒకవైపు వాక్సినేషన్ కొనసాగుతున్నా.. మరోవైపు.. కొవిడ్ కేసులు, మరణాలు మాత్రం ఆగడం లేదు.. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వాయు వేగంతో పెరుతూ వైద్యరంగానికే పెను సవాల్ విసురుతోంది.
ఈ నేపథ్యంలో మన శరీరానికి పదును పెట్టాల్సిందే. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కరోనాకు కొంత మేరకు నిరోధించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటే మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిది.
ముఖ్యంగా ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నిద్ర పోవడం వల్ల టెన్షన్, అసంతృప్తి లాంటివి పెరిగిపోయి నిరసంగా మారుతారు. కావున సరైన నిద్రపోవడం చాలా ముఖ్యం. కనీసం రోజుకు ఒక గంటపాటు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజంను పెంపొందించుకోవచ్చని.. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఫలితంగా ఒత్తిడి కూడా అధిగమించవచ్చు.
వేసవికాలం కావున శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా నీరు బాగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు జ్యూసులు, సిట్రస్ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవడం మంచిది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న మీల్స్‌ను తినాలి. దీని వల్ల బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఫిట్‌గా కూడా ఉండవచ్చు. రెగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్ సైజులు ను చేస్తూ వుంటే శ్వాస వ్యవస్థకు ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చు.
రెగ్యులర్‌గా తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవడం మంచిది. వీటితోపాటు బ్రోకలీ, పాలకూర, పుట్టగొడుగులు, టమాటాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది. ఆహార పదార్ధాలలో అల్లం, ఉసిరి, పసుపు, వెల్లుల్లి, తులసి ఆకులు, నల్ల జీలకర్రను కలిపి తీసుకోవడం మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సో ఇప్పటి నుంచైనా మనం తినే ఆహారం పై దృష్టి పెంచే వ్యాధినిరోధకతను పెంచుకుంటూ కరోనాకు చెక్ పెట్టేద్దాం.