Top 6 News @ 6PM: తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 30న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.
Top 6 News @ 6pm: ఇవాళ అక్టోబర్ 30న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.
1) జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసు: విచారణకు హాజరైన రాజ్ పాకాల
జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. రెండు రోజుల గడువు తీరినందున అక్టోబర్ 30న ఆయన మోకిల పోలీస్ స్టేషన్ కు వచ్చారు.అక్టోబర్ 26న రాజ్ పాకాల తన ఫాంహౌస్ లో దివాళీ పార్టీ ఇచ్చారు.ఈ పార్టీకి వచ్చిన వారిలో విజయ్ మద్దూరికి మాత్రమే డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.
2) తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 17 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలవరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ 2 నిర్వహిస్తారు. నవంబర్ 18న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పేపర్ పరీక్ష ఉంటుంది. గ్రూప్-3 పరీక్ష మొదటి సెషన్ కు ఉదయం 8:30 గంటల నుంచి , రెండో సెషన్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలలోపే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. ఉదయం సెషన్ కు తొమ్మిదిన్నర తర్వాత మధ్యాహ్నం సెషన్ కు రెండున్నర తర్వాత అనుమతించబోమని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మరోవైపు ఏపీపీఎస్ సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు షెడ్యూల్ విడుదల చేసింది. 2025 జనవరి 5న రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ, ఎస్ఎస్ సీ, ఇంటర్ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నారు.
3) ఒప్పందం జరిగినప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా?
జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ నాయకుల ప్రచారాన్ని వైఎస్ షర్మిల తప్పు బట్టారు. ఆస్తుల బదలాయింపుపై ఎంఓయూ జరిగినప్పుడు బెయిల్ రద్దు అవుతుందని జగన్ కు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. అక్టోబర్ 30న ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆమె చెప్పారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు... 32 కోట్ల విలువజేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనన్నారు. 2012 లో క్లాసికల్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు? షేర్లు అమ్మినప్పుడు బెయిల్ రద్దు చేస్తారని తెలియదా? అని అడిగారు. షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని జగన్ కు తెలుసునని ఆమె చెప్పారు.
4) సెక్యురిటీ లేకుండా పాదయాత్రకు రావాలి.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రేవంత్ తో కలిసి ఆ నది వెంట కలిసి పాదయాత్ర చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. సెక్యూరిటీ లేకుండా సీఎం రావాలి... మిమ్మల్ని డీల్ చేయడం కాదు.. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలని ఆయన సూచించారు. పక్కన ఉన్నవాళ్లే ఆయనను కుర్చీ నుంచి దింపుతారని సీఎంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మూసీ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.
5) కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హై కోర్టు 6 వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన అభిమాని రేణుకస్వామి మర్డర్ కేసులో దర్శన్ పాత్ర ఉందన్న ఆరోపణలపై పోలీసులు ఆయన్ను జూన్ 11 అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఆయన జైలులోనే విచారణ ఖైదీగా ఉన్నారు. పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కోర్టు ఆ పిటిషన్లను తిరస్కరించింది. తాజాగా తాను నడుంనొప్పితో బాధపడుతున్నానని, చికిత్స కోసం బెయిల్ ఇప్పించాల్సిందిగా దర్శన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ కు సర్జరీ అవసరమని బల్లారి మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ సెంటర్ న్యూరోసర్జన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కర్ణాటక హై కోర్టు ఆయనకు 6 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. దర్శన్‌కి బెయిల్ మంజూరైందన్న వార్తతో ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 4 నెలలుగా జైలులో ఉన్న దర్శన్‌కి స్వాగతం పలికేందుకే ఇక్కడికి వచ్చామని అభిమానులు తెలిపారు. దర్శన్ భార్య విజయ లక్ష్మీ కూడా బల్లారి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. భర్త దర్శన్‌కు స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ జైలు బయటే వేచిచూస్తున్నారు.
6) భారత్ పై మరోసారి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కెనడా
కెనడా మరోసారి భారత్‌కి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఖలిస్థానీలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేందుకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కుట్ర పన్నారని కెనడా ఆరోపించింది. కెనడా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మారిసన్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమెరికాకు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థకు తానే ఈ విషయం చెప్పినట్లుగా డేవిడ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా కెనడాలో ఖలిస్థానీలను అణిచివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రల వెనుక అమిత్ షా ఉన్నారని డేవిడ్ ఆరోపించారు. కెనడా చేసిన ఈ ఆరోపణలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.