TOP 6 NEWS @ 6PM: అది హిందువులపై చేస్తోన్న కుట్ర. ఆ టపాసులు కొనొద్దు.. కాల్చొద్దు: రాజా సింగ్
Top 6 News @ 6PM: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఇప్పుడు ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.
1) తెలంగాణలో మళ్లీ వర్షాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీచేసింది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్ధితులు నెలకొన్నాయి. పగలంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ సాయంత్రానికి వాతావరణంలో ఉన్నట్లుండి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
2) ఆంధ్రాకు పెట్టుబడుల వేటలో మంత్రి నారా లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు. ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీని తెల్లాప్రగడతోనూ నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించినట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, క్లౌడ్ టెక్నాలజీస్ వంటి విభాగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వారితో భేటీ ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
3) ఆ పటాసులు కొనొద్దు.. కాల్చొద్దు - రాజా సింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో అంశంతో వార్తల్లోకొచ్చారు. హిందూ వ్యతిరేకులు దీపావళి పండగపై ఆంక్షలు విధిస్తున్నారు అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్ల బొమ్మలున్న బాంబులను హిందువుల చేతే కాల్పించే కుట్ర జరుగుతోందన్నారు. దీపావళి నాడు లక్ష్మీ దేవిని పూజిస్తాం. అదే లక్ష్మీ దేవి ఫోటోలు ఉన్న బాంబులను కాలుస్తాం. ఇదెలా కరెక్ట్ అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఏండ్ల తరబడిగా జరుగుతున్న ఈ కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవుళ్ల బొమ్మలు ఉన్న బాంబులను కొనకండి, కాల్చకండి అంటూ హిందువులకు పిలుపునిచ్చారు. దీపావళి వేళ పటాసులు కాల్చే సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు పటాసులు కాల్చేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు.
4) భారత్ - పాక్ సరిహద్దుల్లో సైనికులతో మోదీ దీపావళి వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కచ్‌లో భారత్ -పాక్ సరిహద్దుల వెంట పహారా కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ సైనిక బలగాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. పగటి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతంలో రాత్రి వేళళ్లో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడి సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. అందుకే ప్రధాని మోదీ వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతూ వారితో దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు.
అంతకంటే ముందుగా సర్దార్ వల్లభ్ భాయ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కొన్ని అసాంఘీక శక్తులు దేశాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నాయని అన్నారు. తమ రాజకీయ ప్రయోజనం కోసమే వారు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. అలాంటి అర్బన్ నక్సల్స్ ని ప్రజలే గుర్తించి వారికి వ్యతిరేక పోరాటం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
5) థియేటర్లలోకి వచ్చిన మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ
ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీ ఇవాళే థియేటర్లలోకొచ్చింది. రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు. సాయి పల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్రీకుమార్, శ్యామ్ మోహన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి పల్లవి గతంలో భారత సైనికులను తక్కువ చేసి మాట్లాడారని ఆరోపిస్తూ కొంతమంది నెటిజెన్స్ బాయ్ కాట్ సాయిపల్లవి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ వివాదం సంగతెలా ఉన్నప్పటికీ... ప్రస్తుతానికి ఈ సినిమాకు అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది.
సినిమా విడుదలకంటే ముందుగానే దేశ రాజధాని ఢిల్లీలో సైనికుల కోసం అమరన్ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ షో నిర్వహించింది. ఈ సినిమాను చూసిన ఆర్మీ సైనికులు.. సినిమా చాలా బాగుందని కితాబిచ్చారని శివ కార్తికేయన్ తెలిపారు. ఆర్మీలో మీలాంటి వాళ్ల కోసం అవకాశం సిద్ధంగా ఉంది రండి అని ఆఫర్ కూడా ఇచ్చారని శివ కార్తికేయన్ చెప్పారు. అమరన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ శివ కార్తికేయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమరన్ మూవీ విడుదలకు ముందు జరిగిన బాయ్ కాట్ సాయిపల్లవి నినాదం ఈ సినిమాపై ఎలాంటి ఫలితాన్ని చూపించనుందనేది ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
6) అమిత్ షాపై కెనడా ఆరోపణలు.. స్పందించిన అమెరికా
భారత హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా చేస్తోన్న ఆరోపణలపై అమెరికా స్పందించింది. కెనడా చేస్తోన్న ఆరోపణలు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికా అభిప్రాయపడింది. ఈ విషయంలో పరిస్థితిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తాము కెనడాతో సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలో ఖలిస్తాన్ నినాదంతో ఉద్యమాలు చేస్తోన్న సిక్కులపై దాడులు చేయించడంలో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా పాత్ర ఉందని కెనడా ఆరోపించిన సంగతి తెలిసిందే. కెనడా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాకు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ అనే మీడియా సంస్థ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తానే అమిత్ షా పేరు వెల్లడించానని మోరిసన్ తెలిపారు. కెనడా పార్లమెంటరీ కమిటీ ఎదుట మంగళవారం ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయింది.
ఇప్పటికే కెనడాలో గతేడాది హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిజ్జర్ హత్య కేసుతో భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని కెనడా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సమయంలో కెనడాలో భారత దౌత్యవేత్తలకు రక్షణ విషయంలో తాము కెనడా ప్రభుత్వాన్ని నమ్మలేమని భారత్ అభిప్రాయపడింది. అంతేకాకుండా కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను అక్కడి నుండి వెనక్కి పిలిపించుకుంది. అలాగే ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను కూడా వెనక్కి పంపించింది. దీంతో రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగినట్లయింది.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే తాజాగా కెనడా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఏకంగా అమిత్ షాపైనే ఆరోపణలు గుప్పించారు. దీంతో ఈ వివాదం పతాక స్థాయికి వెళ్లింది. అమిత్ షాపై కెనడా చేసిన ఆరోపణలపై అమెరికా కూడా స్పందించింది. ఇక భారత్ ఏమని స్పందిస్తుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.