Top 6 News @ 6 PM: పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడుతున్నారా: పవన్ కల్యాణ్
1) అది విద్యా హక్కు చట్టం ఉల్లంఘనే: హరీష్ రావు
Harish Rao Writes to Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కుటుంబ సర్వే నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్లను మినహాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. సర్వే కోసం ప్రైమరీ స్కూల్ టీచర్ల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యా హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుందన్నారు హరీష్‌రావు. సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
36, 559 SGT, 3,414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం అని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అకస్మాత్తుగా ఒంటి పూట బడులు నడపడం వలన పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వానికి గుర్తుచేశారు.
2) హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న కులగణన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన సిటీకి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు వెళ్లారు. కుల సంఘాల ప్రతినిధులు, మేధావులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టడం వెనుకున్న ఆలోచనను కూడా ఆయన వారితో పంచుకోనున్నారు.
3) పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడుతున్నారా: పవన్ కల్యాణ్
ప్రజల నుంచి భూములు లాక్కొని స్వంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళవారం పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన భూములను ఆయన పరిశీలించారు. వైసీపీ నాయకులు ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు ఎంత బలంగా ఉన్నాయో వాళ్లకు తెలిసేలా చూడాలన్నారు. పోలీస్ అధికారులు మెత్తబడిపోయారా? లేక భయపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన గుర్తుచేశారు. రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని ఆయన పోలీసులకు సూచించారు. రౌడీలు, గూండాలను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని ఆయన పోలీసులను ఆదేశించారు.
4) తప్పు జరిగిందన్న డీజీపీ
గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అనంతపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండేలా పోలీస్ వ్యవస్థలో చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ప్రైవేటు ఆస్తుల స్వాధీనం అంటే కుదరదు
ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఉమ్మడి ప్రయోజనాల పేరుతో ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం తీసుకుంటామంటే అది అన్ని సందర్భాల్లో కుదరదు అని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. 1950 లలో నెలకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పట్లో నేషనలైజేషన్ జరిగితే ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది అని కోర్టు గుర్తుచేసింది.
6) అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు.. ఫలితం తేలేది ఎప్పుడంటే..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డెమొక్రాట్స్ పార్టీ నుండి కమల హారీస్, రిపబ్లికన్స్ పార్టీ నుండి డోనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది.అసలు ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తారు అనేదే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న ప్రశ్న. ఎన్నికల ఫలితాలు తెలియాలంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపు తేలేవరకు వేచిచూడాల్సిందే. అసలు ఏంటీ ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియ? నవంబర్ 5 నాటి ఎన్నికలతో ఓటింగ్ అయిపోలేదా? పూర్తి వివరాలతో కూడిన వీడియో కథనం ఇక్కడ క్లిక్ చేయండి.