ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా భారీగా డబ్బు పట్టుబడుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో నిమ్మలూరి శ్రీహరి, పండరి అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. వీరి వద్ద 2 కోట్ల నగదు లభించింది. శ్రీహరి, పండరి లభించిన డబ్బులు రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. 2 కోట్ల నగదును సీజ్ చేశారు. శ్రీహరి, పండరితో పాటు ఎంపీ మురళీమోహన్ పై కేసులు నమోదు చేశారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనస్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 377 కోట్ల 51 లక్షల డబ్బును అధికారులు సీజ్ చేశారు అలాగే 312 కోట్ల విలువైన బంగారు, వెండి నగలను కూడా స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక 157 కోట్ల విలువైన మద్యంతో పాటు 705 కోట్ల విలువైన మత్తు పదార్థాలు కూడా పట్టుకున్నారు. ఎన్నికల వేళ పట్టుబడిన డబ్బులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సీజ్ చేసినదే అత్యధికమని ఈసీఐ వివరించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైనా 50 వేలకు మించి నగదు లేదా బంగారు ఆభరణాలు తీసుకు వెళుతుంటే, వీటికి సంబంధించిన పత్రాలను తమతో పాటు తీసుకువెళ్లాలని లేకుంటే సీజ్ చేస్తామని ఈసీ హెచ్చరించింది.