ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అంతో ఇంతో ఉద్రిక్తతంగా సాగుతాయన్న మాట బలంగా వినిపించింది. ఇందుకు తగ్గట్టే నేటి ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో చిన్న చిన్న గొడవలు మొదలు నరుక్కోవటాలు.. చంపుకోవటాల వరకూ వెళ్లటం గమనార్హం.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల కార్యక్రతలు రెచ్చిపోయారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. దీంతో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో టీడీపీ అభ్యర్థి, స్సీకర్ కోడెల శివప్రసాద్ సొమ్మసిల్లి కిందపడిపోయారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో ఇరు పార్టీల కార్యకర్తలు వేట కొడవళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న ఘర్షణలో టీడీపీ నాయకుడు సిద్ధా భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లా రెడ్డి మృతి చెందారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అయితే వైసీపీ నేతలు తమ అనుచరులను కిడ్నాప్ చేశారంటూ భూమా ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ అనుచరులను విడిచిపెట్టకపోతే. గంగుల ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడుతోందని వైసీపీ ఆరోపించడంతో కట్టకిందపల్లెలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి ఎంఎస్ బాబుకి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాతపట్నంలోని 21,22, 23 పోలింగ్ బూతుల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగాంపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రంలో జరిగిన వాగ్వాదం పెద్దదైంది. పోలింగ్ కేంద్రం బయట ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఓ పోలీసు అధికారితోపాటు ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానిపల్లెలో టీడీపీ వైసీపీ వర్గాలు గొడవకు దిగాయి. ఈ ఘర్షణలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ నేత మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు 103 పోలింగ్ బూత్లో హల్చల్ చేశారు. ఓటు వేసేందుకు లోపలికి వచ్చిన ఆయనను గుర్తింపు కార్డు ఏదని ఏజెంట్ అడగడంతో బూతు పురాణం అందుకున్నారు. వీరంగం సృష్టించారు.
ప.గో జిల్లా ఏలూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంనగర్ 9వ రోడ్డులోని పోలింగ్బూత్లో వైసీపీ కన్వీనర్ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడికి పాల్పడ్డారు. రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు.