మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. లైట్ తీసుకోవద్దు అంటున్న నిపుణులు!

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. అనూహ్యంగా తన రూటు మార్చుకుంది. రెండింట మూడోంతల కేసులు నమోదు అవుతుంటే దేశంలో సామాజిక వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది.

Update: 2020-11-05 12:00 GMT

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. అనూహ్యంగా తన రూటు మార్చుకుంది. రెండింట మూడోంతల కేసులు నమోదు అవుతుంటే దేశంలో సామాజిక వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. రాబోయేది చలికాలం కావడంతో కరోనా రక్కసి మళ్లీ కొరలు చాస్తుందంటున్న అంచనాలు ప్రజలను మళ్లీ ప్యానిక్‌ కండీషన్‌‌లోకి నెట్టేస్తున్నాయి. దేశంలోని కొన్ని చోట్ల కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రెండోసారి ప్రమాద ఘంటికలను కాస్త గట్టిగానే మోగించేలా కనిపిస్తున్నాయి.

విద్యాసంస్థలు తెరుచుకున్న కొన్నాళ్లకే కరోనా డేంజర్‌ బెల్స్‌ కొడుతుండటంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు టీచర్లలో ఒక రకమైన భయం మొదలైంది. మొత్తంగా చూస్తుంటే కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించబోతోందా? మహమ్మారి మళ్లీ విజృంభించనుందా? రక్కసి మన ప్రాణాలను మళ్లీ తన గుప్పిట పెట్టుకోనుందా? ఇదే ఇవాళ్టి స్పెషల్‌ ఫోకస్.

మరణాల రేటు తక్కువగా ఉందనో.. రికవరీ రేటు పెరుగుతుందనో మన ఇష్టమొచ్చినట్టు ఉంటామంటే కుదరదంటోంది వైద్యశాఖ. కరోనా లేదు.. ఇక రాదు.. మళ్లీ అంతా నార్మల్ అయిపోందన్న భ్రమ నుంచి బయటకు రావాలని చెబుతోంది. సాధారణ జీవనం మొదలైనా కరోనా రక్కసిని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోంది. వైరస్‌ నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూనే కేసులు పెరగకుండా అడ్డుకునే వ్యూహంతో ముందుకు సాగాలని సూచిస్తోంది.

ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా చలికాలంలో కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందన్న మాటే వినిపిస్తోంది. కరోనా మమమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎవరికి వారు జాగ్రత్తలు చెబుతూనే నార్మల్‌ లైఫ్‌కి అలవాటు పడిపోతున్నారు. యూరప్, బ్రిటన్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో లాక్‌డౌన్ విధించారు. మన దేశంలో కూడా రెండు మూడు నెలల కంటే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించడాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు వైద్యులు. దీనికి తోడు ఏపీ స్కూళ్లలో కరోనా టెన్షన్‌ మొదలవడం కూడా ఆందోళనకు కారణమవుతోంది.

ఏమైనా కరోనా ప్రమాద ఘంటికలు బలంగానే మోగిస్తోంది. ఇప్పుడది మరింత ప్రాణాంతక మార్పులతో విజృంభిస్తోంది. తన కొత్త జన్యు ఉత్పరివర్తనం వ్యాక్సిన్ తయారీ మీద, సామర్ధ్యం మీదా అనుమానాలు కలిగిస్తోంది. అయితే, ఇది పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదంటున్న వైద్య నిపుణులు అలా అని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చెబుతున్నారు. వైరస్ కొత్త జన్యువు వేగంగా వ్యాప్తి చెందుతోందని జాగ్రత్తలు అవసరమేనని చెబుతున్నారు.  

Tags:    

Similar News