నేర చరిత్రలో నయా మోసం ఇది. అభం శుభం తెలియని అమాయకులను నయవంచనకు గురి చేసి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మోసం ఇది. లక్షలు ఇస్తే కోట్లాది రూపాయల విలువైన గుప్త నిధులను వెలికి తీసి నిలువు దోపిడి చేసిన ఘటన ఇది.
గుప్తు నిధులు ఉన్నాయంటూ ఓ బురిడి బాబా పక్కాగా నడిపిన కన్నింగ్ ప్లాన్ ఇది. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సింగతల గురువారెడ్డి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామంలోకి కొత్తగా వచ్చిన ఓ బురిడి బాబు చెప్పాడు. ఇంట్లోని పడక గది మూలలో రెండు మీటర్ల లోతులో భారీగా గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మించాడు. పది లక్షల రూపాయల నగదు ఇస్తే గుప్త నిధులను తీసి ఇస్తామంటూ గురువారెడ్డికి ఆశ పెట్టారు. బంగారం తీయలేకపోతే తీసుకున్న డబ్బు ఇస్తామంటూ నమ్మబలికారు. దీంతో బాబా బుట్టలో పడిపోయిన గురువారెడ్డి అప్పు చేసి మరీ పది లక్షలు తెచ్చి బురిడి బాబాకు ఇచ్చాడు.
నాలుగు మేకలను బలి ఇచ్చి తవ్వకాలు ప్రారంభించిన బురిడి బాబా అర్ధరాత్రి తరువాత గురువారెడ్డిని పిలిచి వెయ్యి బంగారు నాణేలను అందించాడు. గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకోవాలంటూ గురువారెడ్డికి సూచించాడు. ఇదే సమయంలో ఇంట్లో తవ్వకాల గురించి పోలీసులకు స్ధానికులు సమాచారం ఇచ్చారు. గ్రామంలోకి చేరుకున్న పోలీసులు బంగారు నాణేలతో పాటు బురిడి బాబాను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న నాణేలను పరిశీలించారు. రాగి, ఇత్తడి కలిసిన నాణేలకు బంగారు కోటింగ్ వేసినట్టు గుర్తించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న గురువారెడ్డి లబోదిబోమంటూ అసలు విషయం బయటపెట్టాడు.
డబ్బు కోసమే ఈ డ్రామా ఆడినట్టు పోలీసులు గుర్తించారు. అధిక ఆశ చూపించే మోసం చేసే ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. హైటెక్ లెవల్లో జరిగిన కన్నింగ్ ప్లాన్ గురించి తెలుసుకున్న గ్రామస్తులు ముక్కు మీద వేలు వేసుకున్నారు .