Yahya Sinwar's Autopsy: తలలో బుల్లెట్, చేతి వేలు కోసుకెళ్లారు.. యాహ్యా సిన్వార్ అటాప్సీలో సంచలన విషయాలు
Yahya Sinwar's Autopsy News: హమాస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్ పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. యాహ్యా సిన్వార్ తల, ముఖంపై బుల్లెట్ గాయాలున్నట్లు ఆయన శవానికి పోస్ట్ మార్టం నిర్వహించిన చీఫ్ పాతాలజిస్ట్ చెప్పినట్లుగా సీఎన్ఎన్ వెల్లడించింది. తలలో బుల్లెట్ గాయం వల్లే యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా చీఫ్ పాతాలజిస్ట్ చెప్పారని ఆ కథనం పేర్కొంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలించినప్పుడు తాము కనుగొన్న తేడాలను కూడా సీఎన్ఎన్ తమ కథనంలో పేర్కొంది.
ముందుగా చూసిన వీడియోలో యాహ్యా సిన్వార్ డెడ్ బాడీని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పరిశీలిస్తున్నప్పుడు అతడి ఎడమ చేతికి ఐదు వేళ్లు ఉన్నాయి. ఆ తరువాత మరో వీడియోలో చూస్తే అతడి చేతికి చూపుడు వేలు లేదు. నాలుగు వేళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే దానిని బట్టే తమ దాడిలో చనిపోయి పడి ఉన్న వ్యక్తి యాహ్యా సిన్వారేనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇజ్రాయెల్ బలగాలు అతడి చేతి వేలు కట్ చేసి తీసుకెళ్లాయని అర్థమవుతోందని ఆ కథనం స్పష్టంచేసింది. సీఎన్ఎన్ కథనాన్ని బలపరుస్తూ సిన్వార్ ముఖం, కపాలంపై గాయాలున్న వీడియోలను సోషల్ మీడియాలో చూసినట్లుగా ఎన్డీటీవీ కూడా తమ కథనంలో పేర్కొంది.
వాస్తవానికి యాహ్యా సిన్వార్ మృతిని నిర్ధారించుకునే విషయంలో ఇజ్రాయెల్ ఏం చేసిందనే అంశంపై అంతర్జాతీయ మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి. తొలుత అతడి దంతాల ఆధారంగా డీఎన్ఏ పరీక్షలు చేసి చూస్తే అవి సరైన ఫలితాలను ఇవ్వలేదని వార్తలొచ్చాయి. యాహ్యా సిన్వార్ మృతదేహం వద్ద అతడి గడ్డంలోంచి సేకరించిన వెంట్రుకల ఆధారంగానే డీఎన్ఏ టెస్టులు చేసి అతడి మృతిని నిర్ధారించుకున్నట్లు నిన్న ఇంటర్నేషనల్ మీడియా కథనాలు స్పష్టంచేశాయి. ఇదిలావుంటే, తాజాగా ఇలా తలకు బుల్లెట్ గాయం, అతడి చేతి వేలు కోసుకెళ్లి దాని ఆధారంగానే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారనే వార్తలొస్తున్నాయి.