ఉక్రెయిన్‌ వార్‌జోన్‌లో ఊహించని ఘటన.. 65 కిలోమీటర్ల మిలటరీ కాన్వాయ్‌ ధ్వంసం..

Russian Military Convoy: 65 కిలోమీటర్ల మిలటరీ కాన్వాయ్‌ను నేలమట్టం చేసేయొచ్చా..?

Update: 2022-03-31 16:00 GMT

ఉక్రెయిన్‌ వార్‌జోన్‌లో ఊహించని ఘటన.. 65 కిలోమీటర్ల మిలటరీ కాన్వాయ్‌ ధ్వంసం..

Russian Military Convoy: 65 కిలోమీటర్ల మిలటరీ కాన్వాయ్‌ను నేలమట్టం చేసేయొచ్చా..? ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదనే చెబుతారు. కానీ, ఉక్రెయిన్-రష్యా వార్‌జోన్‌లో ఇది జరిగింది. అయితే, పుతిన్ లార్జెస్ట్‌ కాన్వాయ్‌ను ఉక్రెయిన్ సైన్యం ఎలా ధ్వంసం చేసింది..? ఈ భారీ ఆపరేషన్‌లో ఎంతమంది సైనికులు, ఎలాంటి ఆయుధాలతో దాడి చేశారు..? యావత్ ప్రపంచం అన్వేషిస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాలే. అయితే, ఉక్రెయిన్‌లో జరిగింది మాత్రం అంతకుమించి అనే చెప్పాలి.30 మంది కేవలం 30 మంది మాత్రమే ఈ భారీ కాన్వాయ్‌ను నేల కూల్చేశారట.! ఇంతకూ ఆ 30 మంది సైనికుల హిస్టరీ ఏంటి..? ఇలాంటి విధ్వంశాల కోసమే ఉక్రెయిన్ రక్షణశాఖ వాళ్లకు శిక్షణ ఇచ్చిందా..?

ఉక్రెయిన్-రష్యా వార్‌జోన్‌లో ఏమాత్రం ఊహించని ఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఉక్రెయిన్ సేనల తెగువ పోరాట సినిమా కథలకు ఏమాత్రం తీసిపోవన్నట్టే కనిపిస్తున్నాయి. పుతిన్ సేనలను అడ్డుకునేందుకు ఓ సైనికుడు తనను తాను పేల్చేసుకున్న ఘటన నుంచి మొదలు పెట్టి.. 65 కిలోమీటర్ల రష్యా మిలటరీ కాన్వాయ్‌ను కేవలం 30 మంది నేలమట్టం చేశారంటే ఉక్రెయిన్ సేనల పోరాటం ఏ స్థాయిలో కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు. శత్రువులు తమకంటే ఎక్కువమంది ఉన్నారని తెలిసినా, వాళ్ల దగ్గర లెక్కకుమించి ఆయుధాలున్నాయని అర్థమయినా ఏమాత్రం బెదరలేదు సరికదా.. ఊహించని పోరాటంతో అడుగడుగునా సక్సెస్ అయ్యారు. రష్యన్ సేనలపై పోరాటంతో ఒక్కో సైనికుడు ఒక్కో హీరోగా మారిపోయారు.

ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసిన పుతిన్ ఓ భారీ మిలటరీ కాన్వాయ్‌ను ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల నుంచి పంపించారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు చూస్తేనే ప్రపంచ దేశాలకు గుండెలదిరిపోయాయి. అయితే, ఈ భారీ కాన్వాయ్ ఉక్రెయిన్ సేనలను ఏమాత్రం భయపెట్టలేకపోయింది. యుద్ధం మొదలైన కొద్దిరోజులకే ప్రయాణం ప్రారంభించిన పుతిన్ మిలటరీ కాన్వాయ్ రోజుల తరబడి ప్రయాణం సాగిస్తూ వచ్చింది. మధ్య మధ్యలో అదే కాన్వాయ్‌లోని వెహికల్స్ ఒకదాన్ని మరోటి ఢీకొట్టడం లాంటి ఘటనలతో ప్రయాణం అంతతేలిగ్గా సాగలేదు. తీరా లక్ష్యానికి చేరువలోకి వచ్చే తరుణంలో ఉక్రెయిన్ సేనలు రష్యా మిలటరీ కాన్వాయ్‌ను ధ్వంసం చేసేశాయి. అయితే, ఇంత భారీ కాన్వాయ్‌ను ఎలా ధ్వంసం చేశారు? ఉక్రెయిన్‌ ఎలాంటి శక్తిమంతమైన ఆయుధాలను ఉపయోగించింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కురుక్షేత్రంలో కౌరవ సేనలను పాండవులు ఐదుగురే తుదముట్టించినట్టు రష్యా 65 కిలోమీటర్ల మిలటరీ కాన్వాయ్‌ను ఉక్రెయిన్‌ స్పెషల్ ఫోర్స్‌కు చెందిన కేవలం 30 మంది డ్రోన్‌ ఆపరేటర్లు క్వాడ్‌ బైకుల సాయంతో నేలమట్టం చేసేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా వాస్తవంగా జరిగింది మాత్రం ఇదే. ఈ దాడుల్లో ఒక్కో డ్రోన్ ఆపరేటర్ అదునుచూసి పదుల సంఖ్యలో బాంబులు జారవిడిచి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేసేశారట. దీంతో ఆ 30 మంది ఎవరన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. ఇంటర్‌నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆ 30 మంది వివరాల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

కీవ్ నగరం దిశగా సాగుతున్న కాన్వాయ్‌పై ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలకు చెందిన ఏరోరోజ్‌విడ్కా విభాగంలోని 30 మంది డ్రోన్‌ ఆపరేటర్లు అర్ధరాత్రి సమయంలో దాడులు చేయడం ప్రారంభించారు. తొలిరోజుల్లోనే చెర్నోబిల్‌వైపు నుంచి కీవ్‌ దిశగా అర్థరాత్రి సమయంలో క్వాడ్‌ బైకులపై ప్రయాణించి, రష్యా కాన్వాయ్‌ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. డ్రోన్లకు థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరాలు, కిలోన్నర బరువుండే చిన్నచిన్న బాంబులను అమర్చి, కంప్యూటర్‌ ద్వారా వాటిని ఆపరేట్‌ చేశారు. వాటిని రష్యన్‌ ట్యాంకులపైకి మళ్లించి బాంబులను జారవిడిచారు. ఇలా ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకుని రష్యా మిలటరీ కాన్వాయ్ అంతుచూసేవరకూ ఈ 30 మంది యోధులు నిద్రపోలేదు.

మొదటి దాడుల్లోనే కాన్వాయ్‌లోని ముందున్న మూడు వెహికల్స్‌ను పక్కా ప్లాన్ ప్రకారం డ్రోన్లతో కొట్టేశారు. దీంతో రష్యా సైన్యం ముందుకు కదల్లేకపోయింది. ఇదే సమయంలో యుద్ధభూమిలో ఉన్న పుతిన్ సేనలకు ఆహారం, చమురు సరఫరా చేసే డిపోపై డ్రోన్లతో దాడి చేయడంతో కాన్వాయ్ పూర్తిగా నిలిచిపోయింది. ఇదే ఉత్సాహంతో ఆ 30 మంది డ్రోన్ ఆపరేటర్లు ప్రతిరోజూ కొన్ని వాహనాల చొప్పున దాదాపు మొత్తం కాన్వాయ్‌ను ధ్వంసం చేయగలిగారు. దూరం నుంచి కంప్యూటర్ ద్వారా డ్రోన్లను ఆపరేట్ చేయడం వల్ల ఈ యూనిట్‌కు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. కనీసం చేతికి మట్టి అంటకుండానే 65 కిలిమీటర్ల పుతిన్ కాన్వాయ్‌ను ధ్వంసం చేసేశారు.

నిజానికి ఈ యూనిట్‌లో ఉన్న 30 మంది సభ్యులూ యుద్ధంలో శిక్షణ పొందినవారేం కాదు. దేశాన్ని కాపాడుకునేందుకు వచ్చిన స్వచ్ఛంద సైనికులు మాత్రమే. ఈ మొత్తం సభ్యులు ఐటీ ఎక్స్‌పర్ట్స్.. హాబీగా డ్రోన్లపై పరిశోధనలు చేయడం ఒక్కటే వీరికి కలిసొచ్చిన అంశం. ఈ యూనిట్‌ వ్యవస్థాపకుడు వోలోదిమిర్‌ కొచెత్కోవ్‌ సుకచ్‌ ఒక బ్యాంక్ ఇన్వెస్టర్ కాగా.. డ్రోన్లపై అతడికి ఆసక్తి ఎక్కువ. 2015 నాటి డాన్‌బాస్కో ప్రాంతంలో జరిగిన ఒక దాడిలో కొచెత్కోవ్‌ చనిపోయారు. అలాగే, ప్రస్తుత కమాండర్‌ హోంకర్‌ మాజీ సైనికుడు, ఐటీ మార్కెటింగ్‌ కన్సల్టెంట్ కూడా‌. ఇందులో టారస్‌ అనే మరో సైనికుడు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ 30 మంది సైన్యాన్నీ ముందుండి నడిపించడంలో వీరిదే ప్రధాన పాత్ర.

క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం వీరందరూ కలిసి ఈ యూనిట్‌ ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో మార్కెట్‌లో లభించే వాణిజ్య డ్రోన్లను వినియోగించిన ఈ విభాగం క్రమంగా ఇందులోని ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో సొంతంగా డ్రోన్లను అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టింది. అలా బాంబులు, రాకెట్‌-ప్రొపెల్డ్‌ యాంటీ ట్యాంక్‌ గ్రనేడ్స్‌ను జారవిడిచే సామర్థ్యం కలిగిన ఎనిమిది రెక్కల పెద్ద డ్రోన్లను రూపొందించారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి డెల్టా అనే స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. సరిగ్గా ఈ సాఫ్ట్‌వేర్‌తోనే పుతిన్ లాంగెస్ట్ కాన్వాయ్‌ను కొద్దికొద్దిగా చిధ్రం చేసేశారు. చివరికి రష్యన్ సేనలు కాన్వాయ్‌ను విడిచి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయిందంటే ఈ 30 మంది పోరాటమే కారణం.

అయితే, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులతో 2019లో ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ యూనిట్‌ను రద్దు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ వ్యవహారశైలి కారణంగా 2021 అక్టోబరులో మళ్లీ పునరుద్ధరించారు. రష్యన్ల దాడులకు ఇంటర్‌నెట్‌ వ్యవస్థ దెబ్బతినడంతో ఎలాన్ మస్క్‌ తన స్టార్‌లింక్‌ ఉపగ్రహ వ్యవస్థతో సాయం అందిస్తున్నారు. భారీ కాన్వాయ్‌ను ధ్వంసం చేయడమే కాదు, కీవ్ నగరానికి వాయువ్యంగా ఉండే హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్టుపై దాడికి రష్యన్ సైన్యం చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలోనూ ఈ విభాగం సహకరించింది. దండయాత్ర ప్రారంభించిన తొలిరోజే రష్యా ఈ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి 200 పారాట్రూపర్లను రంగంలోకి దింపింది. హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుంటే కీవ్‌పై దాడి రష్యాకు మరింత సులువయ్యేది. కానీ, వారి ప్రయత్నాన్ని ముందే పసిగట్టి ఉక్రెయిన్‌ డ్రోన్‌ యూనిట్‌ రష్యా వ్యూహాన్ని భగ్నం చేయడంలో సక్సెస్ అయింది.

రష్యా సేనలపై పోరాటంలో ఈ 30 మంది మాత్రమే కాదు.. మాతృభూమి కోసం వాలంటరీగా ముందుకొచ్చిన ఎందరో పౌరులు యుద్ధంలో సత్తా చాటారు. ఉక్రెయిన్ సైన్యానికి ఏమాత్రం తీసిపోకుండా తమ దగ్గరున్న అతితక్కువ ఆయుధాలతోనే పుతిన్ సేనల అంతుచూశారు. మొత్తంగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అన్నది పక్కన పెడితే.. ఆ దేశ పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుందన్నది కాదనలేని సత్యం. ఇప్పటికే ఉక్రెయిన్ వార్ స్టోరీస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపై ఉక్రెయిన్ వార్‌జోన్ నుంచి ఇంకెలాంటి వీర గాథలు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News