Imran Khan: పాకిస్తాన్ మూడు ముక్కలవడం ఖాయం

Imran Khan: పాక్‎ను 3ముక్కలు చేసేది ఇండియానే అంటున్న ఇమ్రాన్

Update: 2022-06-02 13:00 GMT

Imran Khan: పాకిస్తాన్ మూడు ముక్కలవడం ఖాయం

Imran Khan: పాకిస్తాన్ లో చిచ్చు రాజుకుంటోంది. రాజకీయ సంక్షోభాన్ని నివారించకపోతే పాక్ అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్లోని పరిస్థితులపై ఆయన అంతరంగాన్ని షేర్ చేసుకున్నారు. రాజకీయ పరిస్థితులను చక్కదిద్దకపోతే పాకిస్తాన్ 3 ముక్కలవుతుందంటూ బాంబు పేల్చారు. అంతేకాదు పాక్ ను మూడు ముక్కలు చేసేది భారతదేశమేనంటూ తన అక్కసునంతా మరోసారి వెళ్లగక్కారు. తాను కోరినట్టు ఎన్నికలు జరిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే పాక్ అస్తిత్వమే కోల్పోతుందన్నారు.

పాకిస్తాన్ లో ఇప్పటికే ప్రత్యేక బలూచిస్తాన్ పేరుతో పోరాటం నడుస్తోంది. బలూచిస్తాన్ ప్రజలకు నరేంద్రమోడీ అంటే అమితమైన గౌరవాభిమానాలున్నాయి. బలూచ్ ప్రాంతం ఒక రకంగా మన కాశ్మీర్ లాంటి సమస్యనే ఫేస్ చేస్తోంది. బలూచ్ ప్రజలకు తెలియకుండా వారి మద్దతైనా తీసుకోకుండా బలూచిస్తాన్ ను పాకిస్తాన్లో కలిపేసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన వెంటనే అటు పాక్, ఇటు భారత్ విడిపోయాయి. ఆయా సంస్థానాలు కూడా ఎవరికి నచ్చిన దేశంలో వారు చేరిపోవచ్చని బ్రిటిష్ పాలకులు శాశ్వత పితలాటకానికి తెర తీశారు. మన దగ్గర కాశ్మీర్ తొలుత ఎందులోనూ చేరనట్టే అక్కడ బలూచిస్తాన్ కూడా పాక్ లో చేరడానికి ఇష్టపడలేదు. అయితే ఆనాటి బలూచిస్తాన్ సంస్థానాధీశులతో సంప్రదించకుండానే పాక్ పాలకులు తమ భూభాగంలో కలిపేసుకున్నారు. దీంతో అప్పుడే అక్కడ వేర్పాటు బీజాలు నాటుకున్నాయి. మరోవైపు బలూచ్ ప్రాంతానికి సముద్రతీరంతో పాటు అత్యంత విలువైన భూగర్భ సంపద కూడా ఉంది. దానిపై కన్నేసిన పాక్ పాలకులు బలూచ్ వేర్పాటువాదాన్ని అణచివేస్తూ వస్తున్నారు. వారి స్వతంత్ర పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆ భయమే ఇప్పుడు పాక్ పాలకులను వెన్నాడుతోంది.

రాజకీయంగా బాగా అస్థిరంగా ఉన్న పాకిస్తాన్లో ఎప్పుడేం జరుగుతుందోనని అధికార పార్టీ నేతలు కూడా లోలోపల వణుకుతూ చచ్చిపోతున్నారు. బలూచ్ పోరాటం కూడా చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ బలగాలను అక్కడి వేర్పాటువాదులు మట్టుపెడుతున్నారు. బలగాలతో జరిగే పోరాటంలో వారూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ బయటపెట్టారు. బలూచిస్తాన్ విడిపోవడం ఖాయమని, అందుకు ఇండియానే ప్లాన్ రచిస్తుందని అంటున్నారు. దీనికంతటికీ కారణం పాక్ లో బలహీన ప్రభుత్వాలు ఉండడమేనన్నారు. ఈ బలహీన ప్రభుత్వాల కారణంగానే ఏ ఒక్క నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామన్నారు.

ఇమ్రాన్ తన ఇంటర్వ్యూలో మరో భయాన్ని కూడా వెళ్లగక్కాడు. పాక్ లో ప్రజాప్రభుత్వం రాకపోతే దేశం నిర్వీర్యమైపోతుందంటున్నారు. అందుకు ఎన్నికలే పరిష్కారమని, ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోతే సైలెంట్ గా ఉంటానని, అంతే తప్ప దొడ్డిదారిన తనను దించివేసి, ఓ బలహీనమైన ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యమని, దానివల్ల ముందుగా సైన్యం వినాశనమవుతుందన్నారు. అది జరిగాక పాక్ నిదానంగా అణు నిరాయుధీకరణ దిశగా అడుగులు వేయాల్సి వస్తుందని దాంతో పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అవుతుందని 1990లో ఉక్రెయిన్ తీసుకున్న అణు నిరాయుధీకరణను ఉటంకించారు. అలాంటి పరిస్థితి రావద్దంటే పాక్ అధికారాన్ని మళ్లీ తనకు అప్పగించాలని, లేదా ఎన్నికలు వెళ్లాలని షరతు పెడుతున్నారు. అందుకే తాను మళ్లీ మరో మార్చ్ కోసం పిలుపునిస్తానని, ఎవరాపుతారో చూస్తానని ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 

Tags:    

Similar News