చైనాకు చెక్‌ పెట్టేందుకు జీ7 అడుగులు

*ఐరోపా దేశాలను కలవరపరుస్తున్న రష్యా, చైనా

Update: 2022-06-28 12:32 GMT

చైనాకు చెక్‌ పెట్టేందుకు జీ7 అడుగులు

G7 Summit 2022: ఉక్రెయన్‌పై దాడితో ఒక వైపు రష్యా బెల్ట్‌ అండ్‌ రోడ్‌తో మరోవైపు చైనా పశ్చిమ దేశాల వైపు దూసుకెళ్తున్నాయి. ఇదే ఇప్పుడు ఐరోపా, అమెరికా, కెనడా దేశాలను కలవరపెడుతోంది. ఈ రెండు దేశాలకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు ఇస్తున్న పశ్చిమ దేశాలు ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీకి చెక్‌ పెట్టేందుకు జీ7 ఆధ్వర్యంలో 60వేల కోట్ల డాలర్లతో ప్రపంచ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు జీపీఐఐ పేరుతో కొత్త ప్రతిపాదన చేశాయి. అయితే ఈ జీపీఐఐ ప్రతిపాదన బెల్ట్‌ అండ్‌ రోడ్‌తో దూసుకొస్తున్న చైనాను అడ్డుకుంటుందా? లేక గతేడాదిలాగే జీ7 చతికల పడుతుందా? అనేది చర్చకు దారితీస్తోంది.

ప్రపంచ ధనిక దేశాలు గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ అదే జీ7 కూటమి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, ఐరోపా సమాఖ్య దేశాలు కూటమిలో సభ్యులు. అయితే ఒకప్పుడు ఈ కూటమిలో ఎనిమిది దేశాలు ఉండేవి అంటే జీ8 అన్నమాట. ఆ ఎనిమిదో దేశం రష్యా. అయితే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నది. దీంతో జీ8 నుంచి ఆ దేశాన్ని తొలగించారు. నాటి నుంచి గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ అయ్యాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ దాడి చేస్తోంది. ఈ దాడికి చైనా మద్దతు పలుకుతోంది. అంతేకాదు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిసియేటివ్‌-బీఆర్‌ఐ పేరుతో ఐరోపాలో పాగా చైనా పాగా వేస్తోంది. ఇప్పుడు ఇదే జీ7 దేశాలకు ముప్పుగా మారింది. దీన్ని ఎదుర్కొనేందుకు ఈ ఏడు దేశాలు సిద్దమవుతున్నాయి. అందుకు పాట్నర్‌షిప్‌‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌-జీపీఐఐ పేరుతో డ్రాగన్‌ ఆటకట్టించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు 60వేల కోట్ల డాలర్లను వెచ్చించనున్నారు.

జీ7 ప్రకటించిన 60 వేల కోట్ల ప్రతిపాదన పాత సీసాలో కొత్త సారాలా ఉందంటున్నారు విశ్లేషకులు. పాత ప్లాన్‌నే మరోసారి తెరపైకి తెచ్చినట్టు చెబుతున్నారు. గతేడాది జీ7 శిఖరాగ్ర సదస్సులోనూ ఇలాంటి ప్లాన్‌ గురించే వెల్లడించారు. అప్పట్లో దానికి బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ వరల్డ్‌-b3w పేరుతో ప్రకటించారు. బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ వరల్డ్‌ అంటే మెరుగైన ప్రపంచాన్ని పునర్నిర్మించడం. ఇది బైడెన్‌ ప్రాచార నినాదం అమెరికా ఎన్నికల్లోనూ, గతేడాది జీ7 సదస్సులోనూ ఇదే నినాదాన్ని వినిపించారు. గతేడాది జీ7 శిఖరాగ్ర సదస్సులోనూ మౌలిక వసతుల కల్పనకు 40 లక్షల కోట్ల డాలర్లను ప్రకటించారు. దీన్ని అమెరికా దగ్గరుండీ చేపడుతుందని బైడెన్ తెలిపారు. కానీ అమెరికా కాంగ్రెస్‌ ఈ పథకాన్ని నీరుగార్చింది. దీంతో అది కేవలం ప్రకటనగానే మిగిలిపోయింది. జర్మనీ జీ7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్‌ కొత్త ప్రతిపాదన చేశారు. గతేడాది ప్రకటించిన b3w ప్రతిపాదనలో 40 లక్షల కోట్ల డాలర్ల నుంచి 60వేల కోట్ల డాలర్లకు తగ్గించారు. వచ్చే ఐదేళ్లలో ఈ 60 కోట్ల డాలర్లను వెచ్చించాలని నిర్ణయించారు.

జీ7 కూటమి ప్రతిపాదించిన 60వేల కోట్ల డాలర్లను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నాలుగు విభాగాల్లో వెచ్చించనున్నారు. వాతావరణ మార్పులు, ఆరోగ్యం, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లింగ సమానత్వం సాధించేందుకు వినియోగించనున్నారు. ఈ నిధులను జీ7 దేశాలు సమీకరించనున్నాయ. ఇందులో అమెరికా 20వేల కోట్ల డాలర్లను, ఐరోపా సమాఖ్య దేశాలు 30వేల కోట్ల డాలర్లను, ఇతర దేశాలు 10వేల కోట్ల డాలర్లను తమ వాటాగా ఇవ్వనున్నాయి. ఇవేకాకుండా మరిన్ని ప్రధాన ప్రాజెక్టులను కూడా జీ7 ప్రతిపాదించింది. అందులో ఐరోపా- దక్షిణాసియాను కలిపే సమాచార వ్యవస్థ సీ-కేబుల్‌ లింకింగ్‌ అంగోలాలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టు, సెనగల్‌లో వ్యాక్సిన్‌ ప్లాంట్‌, రొమేనియాలో న్యూక్లియర్ రియాకర్ట్‌, క్రిస్మస్‌ దీవులతో ప్రపంచానికి నౌకాశ్రయ మార్గాలు కల్పించడం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం కోసం కూడా జీ7 దేశాలు ప్రణాళికలు రూపొందించాయి. అందులో భాగంగా దక్షిణాఫ్రికాలోని అంగోలాలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. దక్షిణాఫ్రికా తరువాత వియత్నాం, సెనగల్‌, ఇండోనేషియా, ఇండియా దేశాల్లోనూ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.

జీ7 ప్రకటించిన ప్రాజెక్టులు చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌కు చెక్‌ పెడుతాయని ధనిక దేశాల నేతలు చెబుతున్నారు. గణంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో 60 వేల కోట్ల డాలర్లను వెచ్చించాలని జీ7 నిర్ణయించింది. చైనా మాత్రం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుపై ఏకంగా 4 లక్షల కోట్లను వెచ్చిస్తోంది. ఏటా కనీసం 8వేల 500 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. చైనా వెచ్చిస్తున్న దానికి జీ7 చెబుతున్న వ్యయానికి ఏమాత్రం సరితూగడం లేదు. అయతే ప్రత్యేకంగా చైనా పేరును ప్రస్తావించకపోయినప్పటికీ జీ7ఎందుకు? ఎవరికి? కౌంటర్‌ ఇస్తుందో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. జీ7 ప్రకటించిన 60 వేల కోట్ల డాలర్లను కూడా ఏరకంగా ఇస్తారో కూడా స్పష్టత లేదు. గ్రాంట్స్, ఫెడరల్‌ ఫండ్స్‌, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరిస్తామని అమెరికా మాత్రం చెబుతోంది. మిగతా దేశాల్లో మాత్రం ఏ క్లారీటీ లేదు.

ప్రపంచ వ్యాప్తంగా రుణాలు ఇస్తూ ఆయా దేశాల్లో బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో మౌలిక వతులను కల్పిస్తోంది చైనా. ఈ క్రమంలో ఐరోపా దేశాల్లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది జీ7 దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పుడు జీ7 ప్రకటించిన పథకాలు చైనాను అడ్డుకుంటాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News