Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై ఈ స్థాయిలో వ్యతిరేకతకు కారణాలేంటి? ఈ మూడు నెలల్లో ఏం జరిగింది?
Donald Trump: శాస్త్రీయ పరిశోధనలకు అమెరికా ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించిన తీరు కూడా విమర్శనీయంగా మారింది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై ఈ స్థాయిలో వ్యతిరేకతకు కారణాలేంటి? ఈ మూడు నెలల్లో ఏం జరిగింది?
Donald Trump: అమెరికాలో ట్రంప్ పాలనపై ప్రజల ఆగ్రహం ఒక్కసారిగా పైకి పొంగిపొర్లింది. దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాషింగ్టన్ నుంచీ చిన్న పట్టణాల వరకూ ప్రతి వీధిలోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. ఈ ఉద్యమాల్లో స్థానికులు మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి అక్కడ నివసించే ప్రజలు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇండియన్ అమెరికన్లు సహా అనేక వలసదారులే ట్రంప్ చర్యలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన అమెరికాలో ఇలా స్వేచ్ఛ కోసం వేలాది మంది బహిరంగంగా రోడ్లెక్కడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది.
డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో రెండోసారి అధ్యక్ష పదవిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తీసుకున్న అనేక నిర్ణయాలు తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. మొదటి రోజే కేంద్ర ప్రభుత్వ ఖర్చులపై కత్తెర వేయడంతో వేల మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. దశాబ్దాలగా ప్రపంచంలోని పేద దేశాలకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన USAIDను నిలిపివేయడం వల్ల అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం ఏర్పడింది. విద్యా రంగంలోనూ స్కూళ్ల మూసివేత, బడ్జెట్ కోతలు విద్యార్థుల భవిష్యత్తు మీద మబ్బుల్లా కమ్ముకున్నాయి. ఇది చిన్నారుల చేతుల్లో ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు కనిపించేందుకు కారణమైంది.
ఇక వలసదారుల విషయంలో ట్రంప్ తీరే వేరు. సరైన పత్రాలు ఉన్నా వలసదారులపై అన్యాయం జరుగుతోంది. డాక్యుమెంట్లు సమర్పించినా, గ్రీన్ కార్డు ఉన్నా వదిలిపెట్టకుండా పంపించడమూ మొదలైంది. ఇటీవల యూనివర్సిటీల్లో పాలస్తీనా మద్దతుగా పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ట్రంప్‌కు అనుకూలంగా ఓటేసిన భారతీయ వలసదారులూ ఇప్పుడే ఇబ్బందుల్లో ఉన్నారు. విమానాశ్రయాల్లో అధికంగా తనిఖీలు, అనవసర జాప్యాలు… ఇవన్నీ భారతీయులనూ ఆందోళనలో నెట్టాయి. అందుకే ఇండో-అమెరికన్ వలసదారులు కూడా ఈ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
పెరిగిపోతున్న వివక్ష అంతటితో ఆగలేదు. ట్రాన్స్ కమ్యూనిటీని సమాజంలో భాగంగా గుర్తించకపోవడం, వాతావరణ పరిరక్షణ చట్టాలను రద్దు చేయడం లాంటి చర్యలు మరింత నిరాశ కలిగిస్తున్నాయి.