Russia-Ukraine war: ఎవరి సత్తా ఎంత? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలాబలాలు ఇవే..
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. భూ, వాయు, సముద్ర మార్గాల్లో సైన్యం దాడులు ప్రారంభించింది.
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. భూ, వాయు, సముద్ర మార్గాల్లో సైన్యం దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఉక్రెయిన్, రష్యా బలగాల బలాలు, ఆయుధ సంపత్తిపై పడింది. యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల బలాబలాలపై ప్రత్యేక కథనం.
ఉక్రెయిన్ సరిహద్దులకు రష్యా లక్ష మందికి పైగా సైన్యాన్ని తరలించింది. ఉత్తర ఉక్రెయిన్ సరిహద్దు దేశం బెలారస్‌లో డ్రిల్స్ కోసం మరి కొంత సైన్యాన్ని తరలించింది. రష్యాలో మొత్తం 8 లక్షల 50 వేల సైన్యంతో పాటు 2 లక్షల 50 వేల పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో 2 లక్షల సైన్యంతో పాటు 50వేల పారా మిలిటరీ దళాలు ఉన్నాయి. రష్యా సైన్యంతో పోలిస్తే 22 శాతం మాత్రమే ఉక్రెయిన్ సైన్యం ఉంది.
రష్యాకు 4వేల 173 విమానాలు 772 ఫైటర్ జెట్లు, 15వందల 43 హెలికాప్టర్లు, 544 దాడి హెలికాప్టర్లు, 12వేల 420 యుద్ధ ట్యాంకులు, 30వేల 122 ఆర్మీ వాహనాలు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌కు కేవలం 318 విమానాలు, 69 ఫైటర్ జెట్లు, 112 హెలికాప్టర్లు, 34 దాడి హెలికాప్టర్లు, 2వేల 596 యుద్ధ ట్యాంకులు, 12వేల 303 ఆర్మీ వాహనాలు ఉన్నాయి. ఉక్రెయిన్ రక్షణ బడ్జెట్ కూడా రష్యాతో పోలిస్తే చాలా తక్కువ. రక్షణశాఖకు బడ్జెట్‌లో 2020లో 4.3 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ వెచ్చింది. ఇది రష్యా రక్షణ బడ్జెట్‌లో కేవలం పదో వంతు మాత్రమే.
ఉక్రెయిన్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ బలహీనంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా దాడులను ఏమాత్రం నిలువరించలేదంటున్నారు. అయితే రష్యాకు మాత్రం భారీ నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్రిమియా దాడులను ఏమాత్రం ఎదుర్కొలేని ఉక్రెయిన్ ఇప్పుడు అలా లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు సైనిక మద్దతుపై ఆశలు పెట్టుకుంది. అయితే అమెరికా మాత్రం సైనిక సహాయం చేయనని తేల్చి చెప్పింది.
ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న డాన్‌బాస్ ప్రాంతం నుంచి రష్యా దాడిని ప్రారంభించింది. ఇప్పటికే పలు నగరాల్లో బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలు, ఆర్మీ గోడౌన్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడులు చేస్తోంది. ఈ యుద్ధం చివరికి ఎటువైపు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.