US vs China trade war: డోనల్డ్ ట్రంప్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన చైనా

Update: 2025-04-11 10:28 GMT

US vs China: అమెరికాతో ట్రేడ్ వార్‌లో దేనికైనా రెడీ అంటున్న చైనా

US vs China trade war with high tariffs: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం సుంకం పెంచుకుంటూ పోతున్నాయి. చైనా నుండి వచ్చే దిగుమతులపై 145 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై తాజాగా చైనా స్పందించింది. అమెరికా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారితో వాణిజ్య పోరుకు (ట్రేడ్ వార్) దిగడానికి తాము సిద్ధమేనని చెనా ప్రకటించింది.

అమెరికాపై ఈ ట్రేడ్ వార్‌లో యూరప్ యూనియన్ తమతో కలిసి రావాల్సిందిగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్పష్టంచేశారు. మరో ప్రకటనలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ట్రేడ్ వార్‌లో గెలిచిన వారు ఎవ్వరూ లేరు అని అన్నారు.

చైనా ఇలా వాణిజ్య పోరుకు దిగాలని కోరుకోవడం లేదు. కానీ ట్రేడ్ వార్ చేయాల్సి వస్తే, దానికి భయపడేది కూడా లేదని లిన్ జియాన్ ప్రకటించారు. ఒకవేళ నిజంగానే అమెరికా ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కావాలని కోరుకున్నట్లయితే, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానేయాలని జియాన్ స్పష్టంచేశారు. అమెరికా విధించే భారీ సుంకాలకు, బెదిరింపులకు చైనా భయపడదు. అమెరికా వైఖరి ఇలానే ఉంటే, తాము కూడా తుదివరకు తేల్చుకోవడానికి సిద్ధమే అని జియాన్ తేల్చిచెప్పారు.

ఇదిలావుంటే, తాజాగా బీజింగ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో భేటీ అయిన జిన్‌పింగ్.. అంతర్జాతీయ వర్తకంలో యూరప్, చైనా తమ బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. అమెరికాపై వాణిజ్య పోరులో పై చేయి సాధించాలంటే యూరప్, చైనా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రతీ సంవత్సరం చైనా నుండి స్పెయిన్ 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. స్పెయిన్, యూరప్ నుండి చైనా దిగుమతి చేసుకుంటున్న మొత్తం కంటే అది చాలా తక్కువ అని స్పెయిన్ ప్రధాని అంగీకరించారు. అంతర్జాతీయ వర్తకంలో ఎదురవుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా తమ దేశాల పరస్పర అభివృద్ధి, సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి అని సాంచేజ్ అన్నారు.

Tags:    

Similar News