America: తప్పు ట్రంప్‌దేనా? ఎన్ని మరణాల తరువాత రష్యా శాంతించనుంది?
America: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆగని సమయంలో ట్రంప్ వైఖరిపై అనేక విమర్శలు వస్తున్నాయి.

America: తప్పు ట్రంప్‌దేనా? ఎన్ని మరణాల తరువాత రష్యా శాంతించనుంది?
America: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆగని సమయంలో ట్రంప్ వైఖరిపై అనేక విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఈ దాడులపై స్పష్టమైన స్టేట్‌మెంట్ ఇవ్వడంలేదు. మిస్సైల్ దాడిలో చిన్నారులు సహా ఎన్నో ప్రాణాలు పోయినప్పుడు, బాధితుల పట్ల దయ కూడా చూపించడంలేదు. అమెరికా చిరకాల శత్రువు రష్యాను కనీసం ఒక్క మాట కూడా అనడంలేదు. అంతేకాదు.. శాంతిచర్చలు జరపాలంటూ పదేపదే ఉక్రెయిన్‌పై ఒత్తిడి చేస్తున్నారు ట్రంప్. ఒకవైపు బాంబులు పడుతున్నప్పుడు మరోవైపు మౌనంగా చర్చల పేరుతో కాలం వెళ్లదీసే ప్రయత్నం బాధితులకు శాపమే అవుతుంది. శాంతి అవసరమే, కానీ న్యాయమే లేని శాంతి ఎప్పుడూ సంపూర్ణం కాదు కదా..! మరి ట్రంప్ ఈ విషయంలో ఎందుకు శాంతిజపం చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టడంలేదు. అధికారంలోకి రాగానే యుద్ధాలను ఆపేస్తానని బలగుద్ది చెప్పిన ట్రంప్.. అటు రష్యా క్రూరమైన దాడులను కనీసం ఖండించడంలేదు.
ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఒక చిన్న ప్రాంతం కోసం మొదలైన ఈ ఘోర సంగ్రామం.. మూడేళ్లు దాటిపోయినా కొనసాగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా ఆక్రమణ ఇప్పటికి ముగియలేదు. ఈ మూడేళ్లలో ప్రతి రోజూ, ప్రతి గంటా ఉక్రెయిన్ గడ్డపై రక్తం పారుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10,000 పైచిలుకు సాధారణ పౌరులు మరణించారు. ఉక్రెయిన్ అంచనాల ప్రకారం ఆ సంఖ్య 30,000 దాటింది. వీరిలో వేలాది మంది పిల్లలు, మహిళలు, వృద్ధులున్నారు.
ఇవి కేవలం గణాంకాలుగా కనిపిస్తున్నా.. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలో ఎవరో ఒకరిని కోల్పోయి ఉన్నారు. ఈ సంఖ్యల వెనక వేల కుటుంబాల కన్నీటి కథలు కనిపిస్తున్నాయి. మరొవైపు యుద్ధంలో చనిపోయిన యుక్రెయిన్ సైనికుల అంత్యక్రియల సమయంలో, వారి పిల్లలు తండ్రి ఫొటో వద్ద ఏడుస్తున్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మరి ఈ బలిదానాలకు ముగింపు ఎప్పుడు? శాంతి ఎప్పుడొస్తుంది? ఎన్ని మరణాల తరువాత రష్యా శాంతించనుందో పుతిన్ క్రూరత్వానికే తెలియాలి.