మందుల కోసం దిక్కులు చూస్తున్న పాకిస్థాన్... చైనా, రష్యాలకు ఆర్డర్స్
Pahalgam attack: పహల్గాం ఎటాక్ తరువాత పాకిస్థాన్ ఎదుర్కోనున్న మరో సమస్య ఔషదాల సరఫరా.

Pakistan's plans to handle medicine shortage crisis: భారత్‌తో విభేదాల తరువాత పాకిస్థాన్‌కు ఎదురవనున్న మరో సమస్య ఔషదాల కొరత. ఇప్పటివరకు పాకిస్థాన్ తమ దేశంలో రోగులకు అవసరమయ్యే మందులు, సర్జికల్ మెటీరియల్స్ లో 30 శాతం నుండి 40 శాతం మెడిసిన్ సప్లై కోసం భారత్ పైనే ఆధారపడుతూ వస్తోంది. కానీ ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే సింధూ నది జలాలను నిలిపేసింది.
భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ గురువారం భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆ దేశాన్నే ఇబ్బందుల పాలుచేసేలా ఉంది. భారత్ నుండి దిగుమతి చేసుకునే మెడిసిన్, సర్జికల్ మెటీరియల్, స్వదేశంలో ఔషదాల తయారీకి అవసమయ్యే ముడి సరుకులను నిలిపేశాక పాకిస్థాన్ కు కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. భారత్ నుండి రావాల్సిన సరుకు నిలిచిపోవడంతో స్వదేశంలో రోగులకు మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ సమస్యను అధిగమించేందుకు పాకిస్థాన్ ఇప్పుడు విదేశాల వైపు చూస్తోంది.
తమకు ఎప్పటి నుండో అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తోన్న చైనా నుండి మరింత ఎక్కువ మెడిసిన్ దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా రష్యాతో పాటు ఇతర యురోపియన్ దేశాలకు కూడా తమకు అవసరమైన మెడిసిన్ ఆర్డర్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
ఇదే విషయమై పాకిస్థాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ( DRAP) స్పందిస్తూ భారత్ నుండి మెడిసిన్ కొనుగోలు చేయకపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆ సమస్యను ఎదుర్కునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నట్లు అంగీకరించింది.