US Green Card: ఏడేళ్లు అమెరికాలో నివాసముంటే గ్రీన్ కార్డు
US Green Card: చాలాకాలంగా నిరీక్షిస్తున్న వలసదారులకు అమెరికా గుడ్న్యూస్
US Green Card: అమెరికాలో శాశ‌్వత నివాస హోదా కోసం చాలాకాలంగా నిరీక్షిస్తున్న వారికి ఆ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ కార్డులకు సంబంధించిన కీలకమయిన బిల్లును అక్కడి చట్టసభలో డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్ వన్ బీ, డ్రీమర్లు, దీర్ఘకాల వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు భారీ ఊరట లభిస్తుంది. కనీసం ఏడేళ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాస హోదా పొందడానికి అర్హులవుతారు.
ఈ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా సభలో ప్రవేశ పెట్టారు. ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజిన్, డిక్ డర్బిన్ బలపరిచారు. పాత ఇమిగ్రేషన్ విధానం ద్వారా లక్షాలది మంది వలసదారులు నష్టపోయారు. వీరందరూ దశాబ్దాలుగా అక్కడ నివసిస్తూ దేశం కోసం పనిచేస్తున్నారు. అయినా వారికి స్వేచ్ఛగా అమెరికాలో జీవించే హక్కును కల్పించకపోవడంతో దేశం కూడా నష్టపోతోంది. వీరందరికీ గ్రీన్ కార్డులు మంజూరు చేస్తే మరింతమంది వలసదారులు నివాస హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటారు. అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టామని సెనెటర్ అలెక్స్ పాడిల్లా తెలిపారు. గ్రీన్ కార్డు పొందిన వారు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండొచ్చని ఆయన చెప్పారు.