Independence Day 2023: నిత్యపూజలు జరిగే మహాత్మా గాంధీ గుడి ఇది.. ఎక్కడుందంటే..?

Independence Day 2023: అహింసా మార్గంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహా నీయునికి అక్కడ గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్నారు‌.

Update: 2023-08-12 15:30 GMT

Independence Day 2023: నిత్యపూజలు జరిగే మహాత్మా గాంధీ గుడి ఇది.. ఎక్కడుందంటే..?

Independence Day 2023: అహింసా మార్గంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహా నీయునికి అక్కడ గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్నారు‌. దేశంలోనే ఎక్కడాలేని విధంగా దైవంతో సమానంగా గుడి కట్టి పూజలు నిర్వహిస్తున్నారు. అహింస మార్గమే మన లక్ష్యమంటూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి నేడు గుడి కట్టి పూజలు చేస్తున్న సందర్భంగా.... ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న వేళ హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో విజయవాడ, హైదరాబాదు జాతీయ రహదారిని ఆనుకుని మహాత్మా గాంధీ గుడి నిర్మించారు. ఈ గుడికి 2012లో మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. 2014, సెప్టెంబర్ 17న ఆలయంలో మహాత్మా గాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుని జ్ఞాపకాలు భావితరాలకు అందాలని, దేశానికి వారు చేసిన సేవలు ముందు ముందు తరాలు తెలుసుకోవాలనే ఆలోచనతో ఈ గాంధీ గుడిని నిర్మించారు. ఈ ఆలయంలో దైవంతో సమానంగా నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ఆలయంలో గాంధీ విగ్రహంతో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయి. అందులో నవగ్రహాలు, పంచభూతాలు ఆలయాలు ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు ఆలయ నిర్వాహకులు.

అన్ని ఆలయాల్లో లాగానే ఈ గాంధీ గుడిలో కూడా గాంధీ అష్టోత్తరం, గాంధీ శతనామకరణ లాంటి అనేక పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గాంధీ గారికి సంబంధించిన పుస్తకాలు, స్వాతంత్య్ర ఉద్యమం నాటి జ్ఞాపకాలకు సంబంధించిన గ్రంథాలు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర నుంచి మట్టిని తెచ్చి ఇక్కడ ఉంచారు.

దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఆ మహానీయుడు గాంధీకి గుడి కట్టి పూజించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని స్థానికులంటున్నారు. ఇలాంటి గుడి తమ ప్రాంతంలో ఉన్నందుకు తామంతా ఇంకా గర్వపడుతున్నామని స్థానికులు చెబుతారు. గాంధీ గారిని నోట్ల పై పుస్తకాలలో పైనే కాకుండా దైవంతో సమానంగా గుడి కట్టి అందులో పూజలు చేయడం అనేది అరుదైన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.

అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన మహాత్ముడు నిజంగా ఇపుడు దేవుడయ్యారు. కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీ బొమ్మ ...ఇపుడు చిట్యాల దగ్గర గుడి లో దేవుడిలా మారింది..నిత్యం పూజలు అందుకుంటుంది..మీరు కూడా మహాత్మాగాంధీ గుడిని దర్శించండి. ఆయమ పోరాట స్పూర్తి ని భావితరాలకు అందించండి.

Tags:    

Similar News