Muthukuri Gowdappa: బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ముత్తుకూరి గౌడప్ప

Muthukuri Gowdappa: పోరాట స్ఫూర్తి నింపిన కర్నూలు జిల్లా తెర్నేకల్లు గ్రామస్తులు

Update: 2023-08-15 10:00 GMT

Muthukuri Gowdappa: బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ముత్తుకూరి గౌడప్ప

Muthukuri Gowdappa: కాలం గతించినా, గతం కళ్ల ముందే నిలుస్తుంది... బ్రిటిష్ పాలకుల చేతుల్లో బందీ అయిన భారత మాతకు స్వేచ్ఛ అందించటానికి ఎందరో బలిదానాలు చేశారు... ప్రాణాలు అర్పించారు... ఆ నాటి పోరాటాలు, త్యాగాల ఫలితమే నేటి అఖండ భారత్... ఇలాంటి పోరాటం చేసిన యోధుల్లో చాలా మంది మరుగున పడిపోయారు... రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలిసారి పోరు సాగింది..

ఎందరో ప్రాణాలు బలి పెట్టారు... మరేందరో తుపాకీ తుటాలకు బలయ్యారు... ఉరి కొయ్యాలు, జైళ్లు, చిత్ర హింసలు, నిర్భంధాలు, బ్రిటిష్ వారి నిరంకుశ పాలనలో నరకం చూశారు... బానిసలుగా బతక లేక తిరగ బడిన త్యాగధనులు ఎందరో ఉన్నారు. బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి... వీరోచిత పోరాటాలు చేసిన వారు స్వాతంత్ర్య సమర పోరాటానికి బలం అందించిన మహానుభావులు.... బ్రిటిష్ అరాచక పాలనపై సమరశంఖం మోగించి... పోరు సాగించిన వారిలో చాలా మంది మరుగున పడి పోయారు... అలాంటి సమరయోధుడు ముతుకూరి గౌడప్ప... రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈ స్వరాజ్య సమరసింహం గురించి చాలా మందికి తెలియదు... సీమలో బ్రిటిష్ పాలన మొదలయిన ఏడాదిలో వారి పాలనను ధిక్కరించి యుద్ధానికి సిద్దమైన మహావీరుడు ముత్తుకూరి గౌడప్ప... రాయలసీమలో తొలి స్వాతంత్ర్య సమరయోధుడు కూడా.

కర్నూలు జిల్లా దేవరకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన ముత్తుకూరి గౌడప్ప 1790 లో జన్మించారు... అప్పటికే రాయలసీమ ప్రాంతం నవాబుల పాలనలో ఉండేది... వారి ఆదేశాలతో స్థానికంగా ఉండే రెడ్లు, కరణాలు పాలన సాగిస్తూ... ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే వారు... అయితే నవాబులకు సైన్యం అవసరం పడడంతో బ్రిటిష్ వారి సహకారం తీసుకున్నారు... ఇందుకు ప్రతిఫలంగా బళ్లారి, కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాలను అప్పగించి... అక్కడ పన్నులు వసూలు చేసుకునే అధికారం బ్రిటిష్ వారికి ఇచ్చారు... అప్పుడే ఆరాచకం మొదలయింది... ఈ నాలుగు ప్రాంతాల్లో తమ ప్రతాపం చూపేందుకు బ్రిటిష్ పాలకులు సిద్ధమయ్యారు... అయితే రైతులు, ప్రజల పక్షాన నిలుస్తూ అప్పటికే ప్రజల మనిషిగా ఎదిగిన ముత్తుకూరి గౌడప్ప అందరినీ అప్రమత్తం చేశారు.

బ్రిటిష్ వారికి నవాబులు ధారాదత్తం చేసిన ఈ నాలుగు ప్రాంతాలను దత్త మండలాలనీ, సీడెడ్ ప్రాంతాలని పిలిచే వారు... 1800 అక్టోబర్‌లో ఈ ప్రాంతాలు బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లాయి... అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి... నిర్భంధ పన్ను వసూలు ప్రజలకు నరకంగా మారింది... దీన్ని గౌడప్ప తీవ్రంగా వ్యతిరేకించారు... రైతులను పోరాటం వైపు నడిపించారు... ఆ సమయంలో బ్రిటిష్ పాలకులు నియమించిన అనంతపురం కలెక్టర్ ధామస్ మండ్రోస్ కఠినంగా వ్యవహరించారు.. పన్నుల వసూలు, పాలన కోసం నలుగురు సబ్ కలెక్టర్లను నియమించిన ధామస్ వ్యవహరించిన తీరు పోరుకు దారి తీసింది.

మరోవైపు మైసూర్ రాజులపై అప్పట్లో యుద్ధానికి సిద్దమైన ఈస్టిండియా కంపెనీ ఆర్థికంగా దెబ్బ తిన్నది... ఈ నష్టం పూడ్చుకోవడానికి సీడెడ్ ప్రాంతాల్లో పన్నులు 50 శాతం పెంచింది... ఈ పన్నులు వసూలు బాధ్యత కరణం శ్రీనివాసరావుపై పెట్టింది... మరో వైపు పన్నులు వసూళ్లపై ఆదోని కలెక్టర్ థాక్రే రైతులపై దాడులు చేయించడ మొదలుపెట్టారు... ఈ పరిస్థితిలో గౌడప్ప తమ ప్రాంతంలోని రెడ్డి, కరణాలను తీసుకొని రైతులు, ప్రజలతో కలిసి పోరుకు సిద్ధమయ్యారు... పన్నులు కట్టలేమంటూ శ్రీనివాస్ రావుకు తేల్చి చెప్పేసారు... అయితే గౌడప్పతో విరోధం ఉన్న గంజరహళ్లి సింగిరెడ్డి రామిరెడ్డి, పెద్దవిల్లి నారప్ప బెయిలప్ప గౌడప్ప నిర్ణయం కుదరదని చెప్పారు... పన్నులు కట్టాలంటూ గట్టిగా చెప్పేశారు... దీంతో రగిలిపోయిన రైతులు, ప్రజలు రాంరెడ్డి, నారప్పను చంపేశారు... శ్రీనివాస్ రావును చంపకుండా వదిలేశారు... ప్రాణాలతో బయట పడిన శ్రీనివాసరావు ఈస్టిండియా కంపెనీ పాలకులకు విషయం చేరవేశాడు... దీన్ని ముందే గ్రహించిన గౌడప్ప యుద్ధానికి సిద్దమై కోటకు ఉన్న నాలుగు ద్వారాలు మూసేయించి ప్రజలను యుద్ధానికి సిద్ధం చేశారు... గౌడప్పపై యుద్దానికి వచ్చిన బ్రిటిష్ సైన్యంపై విల్లులు, కత్తులతో గౌడప్ప అనుచరులు విరుచుకు పడ్డారు.

పదిహేను రోజులు పాటు యుద్ధం హోరుగా సాగింది... ఇందులో గౌడప్పదే పైచేయిగా నిలిచింది... దీంతో ఆదోని కలెక్టర్ థాక్రే సంధి చేయడానికి వచ్చారు... ఇదే సమయంలో కోట రహస్యాన్ని గౌడప్ప వ్యతిరేకవర్గం థాక్రేకు అందించింది... ఉత్తరద్వారం బలహీనత గుర్తించిన ఆయన తన సైన్యంతో కోటలో ప్రవేశించి గౌడప్పను, ఆయన అనుచరులను బంధించాడు... దీంతో గౌడప్ప కనుసైగలతో కోటలోని 15 వందల మంది మహిళలు, చిన్నారులు బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు... ఈ ఘటనతో కలెక్టర్ థాక్రే విస్తు పోయాడు... గౌడప్పతో పాటు ఆయన అనుచరులను ఉరి తీయించాడు... ఇలా గౌడప్ప వీరగాధ ముగిసింది... ఈ పోరాటం నేటికీ రాయలసీమ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

Tags:    

Similar News