టీమిండియా కివీలాండ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తుందా!! న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా టాప్ గేర్
వన్డే క్రికెట్ రెండోర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టీమిండియా...న్యూజిలాండ్ గడ్డపై....పదేళ్ల విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్ గెలుచుకొంది. పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా నేపియర్, బే ఓవల్ స్టేడియాలు వేదికగా ముగిసిన మొదటి మూడు వన్డేల్లో టీమిండియాకు ఎదురేలేకపోయింది. మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుత సిరీస్ లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో పైచేయి సాధించినా......1976 నుంచి 2014 వరకూ న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఆడిన సిరీస్ ల్లో అంతంత మాత్రం రికార్డే ఉంది. మొత్తం ఏడు సిరీస్ ల్లో టీమిండియా ఒక్క సిరీస్ మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ప్రస్తుత సీరీస్ లో 3-0 ఆధిక్యంతో కివీ గడ్డపై రెండో సిరీస్ ను ఖాయం చేసుకొంది.
ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ...టీమిండియా, న్యూజిలాండ్ జట్లు.. రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండుజట్ల ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ ...మొదటి మూడు వన్డేలు ముగిసే వరకూ ఉన్న రికార్డులను చూసినా...న్యూజిలాండ్ దే పైచేయిగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ 1976 నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ వస్తోంది. ప్రస్తుత సిరీస్ మొదటి మూడు వన్డేల వరకూ ఆడిన మొత్తం ఎనిమిది సిరీస్ ల్లో భారత్ రెండుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది. 1976 ప్రారంభ సిరీస్ లో 0-2తో పరాజయం పొందిన భారత్ కు...1991 సిరీస్ లో సైతం అదే ఫలితం ఎదురయ్యింది.
1994 లో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసి సత్తా చాటుకొంది. అంతేకాదు...1999 సిరీస్ ను సైతం 2-2తో సమం చేయగలిగింది. 2002-03 జరిగిన ఏడు మ్యాచ్ లో సిరీస్ లో భారత్ కు 2-5తో భారీ ఓటమి తప్పలేదు. 2009 సిరీస్ లో భారత్ తొలిసారిగా న్యూజిలాండ్ పై 2-1తో విజేతగా నిలిచింది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ తొలిసారిగా కివీ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకోగలిగింది. ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్ వేదికగా ముగిసిన ఐదుమ్యాచ్ లో సిరీస్ లో ఓమ్యాచ్ ను టైగా ముగించిన భారత్...మిగిలిన నాలుగువన్డేల్లోనూ పరాజయాలు చవిచూసింది. చివరకు 0-4తో సిరీస్‌ను చేజార్చుకొంది.
ఓవరాల్‌గా ఈ రెండుజట్ల మథ్య...న్యూజిలాండ్ గడ్డపై జరిగిన 8 సిరీస్ ల్లో కివీటీమ్ నాలుగు సిరీస్ విజయాలు సాధిస్తే...రెండు సిరీస్ లు డ్రాగా ముగిసాయి. మరో రెండు సిరీస్ ల్లో మాత్రమే భారత్ విజేతగా నిలిచింది. ఈ రెెండుజట్ల మధ్య జరిగిన వన్డే ల్లో సైతం...న్యూజిలాండ్ ఆధిక్యమే కనిపిస్తుంది. న్యూజిలాండ్ తో భారత్ మొత్తం 37 వన్డేల్లో తలపడితే... 13 విజయాలు సాధించి...21 పరాజయాలు చవిచూసింది. ఓ మ్యాచ్ టైగా ముగిగియగా...మరో రెండు వన్డేలు ఫలితం తేలకుండానే రద్దులపద్దులో చేరాయి.
ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ లో మాత్రం...విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ....మొదటి మూడు వన్డేల్లో విజయాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ ఏమాత్రం పోటీకాదని చాటుకొంది. మొదటి మూడు వన్డేల్లో పాల్గొనడం ద్వారా టీమిండియాకు సిరీస్ విజయం ఖాయం చేసిన కొహ్లీ...ఆఖరి రెండువన్డేలతో పాటు...తీన్మార్ టీ-20 సిరీస్ కు సైతం,,విశ్రాంతి పేరుతో దూరంకానున్నాడు. మిగిలిన రెండు వన్డేల్లో విజయాలతో పాటు సిరీస్ స్వీప్ సాధించాల్సిన బాధ్యత...ఇక వైస్ కెప్టెన్ కమ్ స్టాప్ గ్యాప్ కెప్టెన్ రోహిత్ శర్మ పైనే ఉంది. సిరీస్ లోని నాలుగో వన్డే జనవరి 31న హామిల్టన్, ఆఖరి వన్డే ఫిబ్రవరి 3న వెలింగ్టన్ వేదికలుగా జరుగనున్నాయి.