Terrace Gardening: మిద్దె సాగు చేస్తున్న రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్

Terrace Gardening: విజయనగరం జిల్లా కురుపాం కు చెందిన మల్లికార్జున్ రావు రిటైర్డ్ బ్యాంకు మేనేజర్.

Update: 2021-12-07 08:42 GMT

Terrace Gardening: మిద్దె సాగు చేస్తున్న రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్

Terrace Gardening: విజయనగరం జిల్లా కురుపాం కు చెందిన మల్లికార్జున్ రావు రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. చిన్నప్పటి నుంచి ఈయనకు మొక్కల పెంపకం అంటే అమితమైన ఇష్టం. అందుకే ఉద్యోగ విరమణ అనంతరం మొక్కల మధ్య గడుపుతున్నారు. తన మేడ మీద ఓ చిన్నపాటి వనాన్ని నిర్మించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదదీరుతున్నారు. ఏడు పదుల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో మిద్దె తోట పనులను చేస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఒక్కో మిద్దె సాగుదారి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. కొంత మంది కూరగాయలపై దృష్టిసారిస్తే మరికొంత మంది పూలు పండ్లను పెంచుతుంటారు. అదే విధంగా మల్లికార్జున్‌ రావు గారు తన మేడను ఔషధ మొక్కల నిలయంగా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా పంట పొలాల గట్లపైన, పాక్షిక అరణ్య ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లోనూ అనేక ఔషధ గుణాలుంటాయి. కానీ అది ఎవరికీ తెలియదు. చాలా మంది వాటిని కలుపు మొక్కల్లానే చూస్తుంటారు. కానీ ఆ మొక్కల్లోనే అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు మల్లికార్జున్ రావు గారు. నిత్యం మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.

మొక్కలను పెంచడం అంటే దైవ కార్యక్రమంతో సమానం అని భావిస్తారు ఈ మిద్దె సాగుదారు. తన మేడ మీద ఔషధ మొక్కలతో పాటు పూల మొక్కలకు పెంచుతున్నారు. పూల మొక్కల పెంపకంలోనూ ఆరోగ్యానికే ప్రాధాన్యతను ఇస్తారు మల్లికార్జున్‌ రావు గారు. మేడ మీద ఎక్కువ మొత్తంలో గులాబీలు, మందారాలు కనువిందు చేస్తుంటాయి. అందుల్లోనూ నాటు రకాలనే పెంచుతున్నారు. ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు ఈ సాగుదారు. ఈ పూలను కోసి దేవుడికి పెట్టి ఆ తరువాత వాడిన పూలను మరిగించి కషాయంగా మార్చి ప్రతి రోజు తీసుకుంటే గుండెకు బలమంటున్నారు. పూలతో పాటే కొన్ని కూరగాయ మొక్కలను పెంచుతూ ఇంటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు.

మిద్దె తోటలో మొక్కలను పెంచేందుకు పెయింట్ డబ్బాలు, పెద్ద పెద్ద టబ్బులతో పాటు సిమెంటుతో ఎలివేటెడ్ కుండీలను నిర్మించుకున్నారు ఈ సాగుదారు. వీటి నిర్మాణానికి సుమారు 50 వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఈ కుండీల వల్ల స్లాబ్ పడవదని ఎక్కడా లీకేజ్ ఉండదంటున్నారు. ఇందుల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు మట్టితో పాటు ఆవుపేడ, వేపపిండిని వాడుతున్నారు. రసాయన రహితంగా మొక్కల పెంపకం చేపట్టాలనే ఉద్దేశంతోనే మిద్దె సాగుకు శ్రీకారం చుట్టానంటున్నారు మల్లికార్జున్ రావు. మార్కెట్‌ లో లభించే విషపూరితమైన, క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిగిన ఆహార ఉత్పత్తులను తిని అనారోగ్యాల బారిన పడేకంటే ఇంటిపట్టునే ఇలా సేంద్రియ పద్ధతులను అవలంభించి మొక్కలను పెంచి ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.

ప్రతి రోజు గార్డెన్ పనులకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు ఈ మిద్దె సాగుదారు. తద్వారా వ్యాయామంతో పాటు కాలక్షేపం లభిస్తోందని తెలిపారు. 70 ఏళ్ల వయస్సులోనూ ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే అది మిద్దె సాగు వల్లే సాధ్యమైందని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ మేడ మీదనో, బాల్కనీలోనో, పెరట్లోనో మొక్కలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా శారీరక , మానసిక ఆనందాన్ని పొందాలంటున్నారు.

Full View


Tags:    

Similar News