Natu Kolla Pempakam: నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్న అమిత్ మండల్
Natu Kolla Pempakam: ఆ యువకుడు పెద్దగా చదువుకోలేదు. అయినా ఉద్యోగం లేదని బెంగపడలేదు.
Natu Kolla Pempakam: ఆ యువకుడు పెద్దగా చదువుకోలేదు. అయినా ఉద్యోగం లేదని బెంగపడలేదు. నేటి రోజుల్లో కూలీ పనులు చేస్తే కుటుంబాన్ని పోషించలేని గడ్డుపరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచనకు పదును పెట్టి సొంతూరిలోనే ఉపాధికి మార్గం ఎంచుకున్నాడు. మొదట్లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆదాయం పొందాడు అంతటితో ఆగక మరిన్ని ఆదాయా మార్గాలను ఎంచుకున్నాడు. అలా కోళ్లు, చేపలను పెంచుతూ ప్రతి నెల ఆదాయం గడిస్తూ గ్రామంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువరైతు అమిత్ మండల్.
అమిత్ మండల్ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితో చదువు ఆపేసాడు. కొద్దికాలం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. కూలీ డబ్బులు కుటుంబ పోషణకు సరిపోయేవి కావు. వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి లేని దుస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఊరిలోనే తక్కువ పెట్టుబడితో హైదరాబాద్ నుంచి కోడి పిల్లలను తెచ్చి తన ఇంటి ఆవరణలోనే కడక్ నాథ్ కోళ్ల ఫారం ఏర్పాటు చేశాడు. ముందుగా 50 కోళ్లతో ప్రారంభమై నేడు వెయ్యికి పైగా కోళ్లతో సాగుతోంది.
ఇటీవల దేశీ కోళ్ల పెంపకం మొదలు పెట్టాడు అమిత్. నల్లకోళ్ల, దేశీ కోళ్ల మాంసానికి మార్కెట్లో డిమాండ్ బాగుంది. ఏడు నెలల వ్యవధిలోనే కడక్ నాథ్ కోడి పిల్లలు ఎదిగి కిలో బరువు వస్తున్నాయి. కిలో ఒక్కింటికి 900 నుంచి 1300 రూపాయల వరకు ధర పలుకుతుండటంతో ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ యువరైతు.
వ్యవసాయంతో వస్తున్న ఆదాయంతో ఈ యువరైతు ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించు కోవడంలో ఈ యువకుడు ముందున్నాడు. సామాజిక మాధ్యమాల సహకారంతో కోడి గుడ్లను పొదిగేందుకు ఓ యంత్రాన్ని సైతం తయారు చేశాడు. ఓ పాడైన కూలర్ డబ్బాకు విద్యుత్ బల్బులు అమర్చి వాటి ద్వారా వచ్చే వేడితో గుడ్లు పొదిగేందుకు అణువుగా మార్చాడు. పిల్లలు కొనుగోలు చేయకుండా తన వద్ద ఉన్న కోడిగుడ్లను పొదిగించి పిల్లలను తయారు చేస్తున్నాడు. దీంతో ఆదాయానికి మరింత ఆసరా తోడవుతోంది. ఇక కోళ్లకు దానాగా ఇంటి వద్ద పొలంలో గడ్డి జాతి మొక్కల ను పెంచుతున్నాడు దీనివల్ల కోళ్ళకి దాణా ఖర్చు తగ్గడమే కాకుండా కోళ్లు బలంగా తయారై అధిక బరువుకు వస్తున్నాయంటున్నాడు పెంపకందారు.
కోళ్ల పెంపకం కొన సాగిస్తూనే ఇటీవల తన సొంత భూమిలో చేపల చెరువును తవ్వించాడు. మార్కెట్లో మంచి గిరాకీ ఉండే రాహు, కట్లా రకాలకు చెందిన 16 వేల చేప పిల్లలను వేసి పెంపకం చేపట్టాడు. వ్యవసాయాధికారులు సైతం రైతు కృషి చూసి అభినందిస్తున్నారు. యువకులు ఉద్యోగం లేదని బెంగపడకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి కష్టపడినట్లయితే ఏ ఇబ్బందులు ఉండవని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు ఈ యూవరైతు.