Lemon Grass: నమ్మండి నిమ్మగడ్డితో.. నెలకు రూ.45 వేల ఆదాయం
Lemon Grass: గతంలో వరి సాగు చేసిన ఆ రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
Lemon Grass: గతంలో వరి సాగు చేసిన ఆ రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించినా పంట నిలవదని గుర్తించాడు ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టిసారించాడు. సామాజిక మాధ్యమాలలో అన్వేషణ ప్రారంభించాడు. ఏ పంట వేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చో తెలుసుకున్నాడు. నిమ్మ గడ్డి సేద్యం వైపు నెమ్మదిగా అడుగులు వేశాడు. మార్కెట్‌లో గిరాకీ ప్రాంతం అనుకూలం కావడం ఆ రైతుకు కలిసి వచ్చింది. సేంద్రయ విధానంలో నిమ్మగడ్డి సాగు చేస్తూ నాణ్యమైన నూనెను ఉత్పత్తి చేస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా రైతు కడియం కేశవరావు.
శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంగా పేరుగాంచిన కంచిలి మండలంలోని పోలేరు గ్రామం ఇది. ఈ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కడియం కేశవరావు గతంలో వరి సాగు చేసేవారు. అయితే స్థానికంగా అడవి పందుల బెడదతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల సేద్యంలో తీవ్రంగా నష్టపోయారు. దీనితో ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం సామాజిక మాధ్యమాలను ఆశ్రయించిన కేశవరావు నిమ్మగడ్డి సాగువైపు ఆసక్తి చూపారు. నిపుణుల సలహా మేరకు తనకున్న ఆరు ఎకరాల పొలంలో నిమ్మగడ్డి సాగు చేశారు.
నిమ్మ గడ్డి పండించేందుకు ప్రత్యేకమైన ఎరువులు అవసరం లేదు. సేంద్రియ విధానంలోనే సాగు చేసుకోవచ్చు. చీడపీడలు పెద్దగా ఆశించవు. పైగా ఏ జంతువులు కూడా దీన్ని పాడు చేయవు. అందుకే ఈ పంట అన్ని రకాలుగా లాభాలను అందిస్తుంది.
నిమ్మ గడ్డి సాగుకు బీడు వారిన, మెట్ట ప్రాంతాలు అనుకూలమైనవి. ఒకసారి పంటను వేస్తే కోతకు రావడానికి మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. అంతే కాదు ఒక మొక్కను కనీసం ఆరు నుంచి ఏడు సార్లు కోసుకోవచ్చు. ఎకరానికి సుమారు మూడు నుంచి నాలుగు టన్నుల వరకు గడ్డి మొదటి దశలో కోతకు వస్తుందని రైతు చెబుతున్నాడు. ఆ తరువాత తీసే కోతలకు 3 టన్నులకు తక్కువ కాకుండా గడ్డి అందివస్తుందంటున్నాడు. కట్టింగ్ చేసిన గడ్డిని నూనెగా మార్చుకునేందకు ప్రత్యేకంగా యంత్రాన్ని కొనుగోలు చేశాడు. దాని నుంచే స్వయంగా నూనెను ఉత్పత్తి చేస్తున్నాడు. ఎకరాకు మూడు టన్నులు కోతకు గడ్డితో 30 కేజీల నూనె వస్తుందని లీటరు 1300 నుంచి 1400 వరకు ధర పలుకుతుందని రైతు చెబుతున్నాడు. ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సాగులో మెళకువలు నేర్పుతానంటున్నాడు రైతు కేశవరావు.