చివరి దశకు చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర

Update: 2018-11-26 05:17 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేపట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.  12 జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ‌న్ నిన్న శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటరయ్యారు. జిల్లాలోని పది జిల్లాల మీదుగా పాదయాత్ర కోననసాగించనున్న ఆయన వచ్చే ఏడాది జనవరి ఐదు నాటికి పాదయాత్రను ముగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. 2019 ఎన్నకల్లో గెలుపే లక్ష్యంగా,  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చివరి మజిలీకి చేరుకుంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ ఆర‌ున క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌ నుంచి పాద‌యాత్ర ను మెద‌లు పెట్టిన జ‌గ‌న్ ప్రస్తుతం చివ‌రి జిల్లా అయిన శ్రీకాకుళం చేరుకున్నారు.

పాల‌కొండ నియోజ‌క‌ర్గం వీర‌ఘ‌ట్టం దగ్గర జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు పార్టీ నేతలు, స్ధానికులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిత్లీ తుపాను వచ్చినా పరామర్శించలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్న వేళ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 

 ఇప్పటి వ‌ర‌కూ 305 రోజుల పాటు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్ దాదాపు 3313 కిలోమీట‌ర్ల మేర న‌డిచారు.  125 నియోజ‌క‌ర్గాల మీదుగా సాగిన తన పాదయత్రలో 114 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ముగిసే సరికి 3 వేల 600 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజా సంకల్పయాత్రను ముగించాలని భావిస్తున్న జగన్ ఇదే వేదికగా తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్నందున వీలైనంత త్వరగా పాదయాత్ర పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను ఓటు బ్యాంకు రూపంలో మార్చుకోవడంలో సఫలమయినట్టు భావిస్తున్న జగన్ సమర్ధవంతమైన అభ్యర్ధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  

Similar News