రెండు తెలుగు రాష్ట్రాల్లో పంజా విసిరిన చలిపులి

Update: 2018-12-19 03:25 GMT

చలికి రెండు తెలుగు రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. పెథాయ్ తుఫాను ప్రభావం కారణంగా చలి తీవ్రత మరింత ఎక్కువైందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు చలిపులోకి తట్టుకోలేక ఉభయరాష్ట్రాల్లో పలువురు మృతిచెందినట్టు తెలుస్తోంది. చలి తీవ్రత హైదరాబాద్ నగరవాసుల్ని వణికిస్తోంది. ఇంటినుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో నగరంలో పగటిపూట 19.8, రాత్రివేళల్లో 15.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉంది. కానీ తొమ్మిది డిగ్రీలు తగ్గి 19.8 డిగ్రీలు రికార్డు కావటంతో చలి పులి పంజా విసిరింది. మరోవైపు శీతల గాలుల ప్రభావానికి ఆంధ్రప్రదేశ్ రెండు రోజుల వ్యవధిలో 30 మందికి పైగా మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పెథాయ్‌ తుపాను ప్రభావంతో మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈదురు గాలుల ప్రాభవంతో వందలాది మూగజీవాలు మృతిచెందాయి. గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే10 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీని ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇదిలావుంటే విపరీతమైన చలి ప్రభావంతో పిల్లలకు జలుబు, జ్వరం వచ్చే ప్రమాదం ఉందని.. అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలకు చలి తగలకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Similar News