ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Update: 2018-11-18 03:07 GMT

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు నల్లమాడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మహాకూటమిలో భాగంగా ఆయనకు సిట్టింగ్ స్థానం హుజూర్ నగరే వచ్చింది. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఉత్తమ్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ప్రజలకు ఏం చేసిందో, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తుందో నిలదీయాలని కోరారు.

అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు వంటి హామీలు అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చివరకు తెలంగాణ సాధించించుకోవడంలో ముఖ్య పాత్ర వహించి అమరులైన వారి కుటుంబాలను కూడా ఆదుకోలేకపోయారని విమర్శించారు. ఈ సందర్బంగా హుజూర్ నగర్ చెందిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, ఆమెకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాటు పార్టీని నమ్ముకొని ఆమె పని చేసినప్పటికీ కనీసం నామినేటెడ్‌ పదవి కూడా ఇవ్వలేదని ఉత్తమ్‌ విమర్శించారు.

Similar News