తమిళనాడులో పళణిస్వామి ప్రభుత్వం దిగివచ్చింది. ఆందోళనకారులు చేస్తున్న డిమాండ్లను అంగీకరించింది. వేదాంత గ్రూప్ కి చెందిన స్టెరిలైట్ కర్మాగారం శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
తూత్తుకుడిలో నెలకొన్న స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళన కారులు చేపట్టిన ఉద్యమం విజయం సాధించింది. స్టెరిలైట్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఆందోళన కారులు దాదాపు 100 రోజుల పాటు ఉద్యమం చేపట్టారు. మే 22న ఉద్యమం హింసాత్మకంగా మారింది. 13 మంది ఆందోళకారులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో పళణిస్వామి ప్రభుత్వం కళ్లు తెరిచింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును రంగంలో దించింది. స్టెరిలైట్ ప్లాంట్ కు విద్యుత్ నిలిపివేసింది. తాత్కాలికంగా ప్లాంట్ ను మూసివేసేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ చర్యలతో ఆందోళకారులు సంతృప్తి చెందలేదు. శాశ్వతంగా ప్లాంట్ మూసివేయాలని అన్ని వర్గాల నుంచి పళణిస్వామి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని కాలుష్య నియంత్రణ బోర్డును ఆదేశించింది. దీంతో అధికారులు స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేశారు.
ప్లాంట్ మూసివేయడం వల్ల తలెత్తే న్యాయ సమస్యలను ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొంటుందని ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. 2013లోనే అప్పటి ముఖ్యమంత్రి జయలలిత స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలని ఆదేశించిన విషయాన్ని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గుర్తుచేశారు. జయలలిత ఆదేశాలతో ఖంగు తిన్న స్టెరిలైట్ యాజమాన్యం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ప్లాంట్ తిరిగి మొదలయ్యేలా అనుమతి సంపాదించింది. తమిళనాడు ప్రభుత్వం కూడా స్టెరిలైట్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. సుప్రీంకోర్టులో ప్లాంట్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ లో ఉందని పన్నీర్ సెల్వం తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వం స్టెరిలైట్ ప్లాంట్ పై కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. దుకాణాలన్నీ యథావిధిగా తెరుచుకుంటున్నాయి. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. దీంతో ట్రేడర్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు కాల్పుల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది.