SM Krishna Death: మాజీ సీఎం SM కృష్ణ ఇకలేరు..అనారోగ్య కారణాలతో తన నివాసంలో కన్నుమూత
SM Krishna Death: కర్నాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతోపాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 92ఏళ్ల వయస్సులో బెంగళూరులోని సదాశివనగర్ లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మే 1, 1932న కర్ణాటకలోని మాండ్య జిల్లా సోమనహళ్లి గ్రామంలో జన్మించారు. ఎస్‌ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. తన ప్రాథమిక విద్యను హత్తూరులో పూర్తి చేశారు. సెకండరీ విద్యను మైసూర్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాశాలలో, తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ని మైసూర్‌లోని మహారాజా కాలేజీలో పూర్తిచేశారు. లా డిగ్రీని యూనివర్సిటీ లా కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. డల్లాస్, టెక్సాస్, USAలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ DCలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుండి పట్టభద్రులయ్యారు.
1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అక్కడి నుంచి కృష్ణ ఎన్నికల రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 'ప్రజా సోషలిస్టు పార్టీలో' చేరారు. అయితే 1967 ఎన్నికల్లో మద్దూరు నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎంఎం గౌడ్‌పై ఓడిపోయారు. 1968లో సిట్టింగ్ ఎంపీ మరణించడంతో మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు.1968 ఉప ఎన్నికల తర్వాత మాండ్య నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యాను కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టడంలో ఎస్ఎం కృష్ణ పాత్ర కీలకం.
1999లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. అప్పటి నుంచి ఎస్‌ఎం కృష్ణ చేపట్టిన పాంచజన్య యాత్ర కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్‌కు సత్తా చాటింది. డిసెంబర్ 2004లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన కృష్ణ 5 మార్చి 2008న మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.అనంతరం రాజ్యసభకు ఎన్నికై, 2009 మే 22న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా కొనసాగారు.
తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగింది. జనవరి 29, 2017న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. 2017 మార్చిలో బీజేపీలో చేరారు. అనారోగ్యంతోపాటు ఇతర కారణాల వల్ల 7 జనవరి 2023న రాజకీయాల వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. SM కృష్ణది ప్రేమ వివాహం. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
SM కృష్ణ జీవిత చరిత్ర 'స్మృతి వాహిని' డిసెంబర్ 2019 లో విడుదలైంది. కన్నడ నటుడు డా. రాజ్‌కుమార్‌ను కడగళ్ల వీరప్పన్ అపహరించడం (ఎస్‌ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్న అనేక ఆసక్తికరమైన సంఘటనలను ఆయన 'స్మృతి వాహిని'లో ప్రస్తావించారు.