ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణాలేంటి..?

Update: 2018-12-19 05:59 GMT

తెలుగు రాష్ట్రాలు చలి పులితో వణికిపోయాయి. పలు చోట్ల మిట్ట మధ్యాహ్నం కూడా చలి వేసింది ? ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోయారు. ఏజెన్సీ, కోస్తాతీర ప్రాంతం, ఉత్తర తెలంగాణాల్లో దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఎందుకింత తీవ్ర చలి వేసింది ? చలిపంజాకు కారణమేమిటి?

వారం క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి కొంచెం బలహీనపడి గత సోమవారం కాకినాడ వద్ద తీరం దాటింది. తుఫాన్‌ తీరం వైపు పయనించే క్రమంలో కోస్తాలో గాలుల తీవ్రత పెరిగి మేఘాలు ఆవరించాయి. దీనికితోడు శీతాకాలం కావడంతో తీవ్ర చలి వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుంచి సూర్యుడు కనిపించలేదు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సమయంలో ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్యభారతం, దానికి ఆనుకుని తెలంగాణ, ఒడిశా వరకు వీచాయి. టిబెట్‌ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉత్తరాది నుంచి మధ్య భారతం వరకూ రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉత్తర, మధ్య రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. టిబెట్ నుంచి వీస్తున్న చలి గాలులు ఉత్తరాది నుంచి  తెలుగు రాష్ట్రాల వరకూ విస్తరించాయి. అదే సమయంలో తుఫాన్‌ గాలులు వీచాయి. ఈ రెండింటి ప్రభావంతో నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి పది డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. తుఫాన్‌  బలహీనపడి అల్పపీడనంగా మారి పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉంది. అందువల్ల రానున్న రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయి.  

చలి పంజాకు తెలంగాణలో 13 మంది మృతి చెందారు. వీరిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ కశ్మీరం ఆదిలాబాద్‌ జిల్లాలో తలమడుగు, గుడి హత్నూర్‌, బజార్‌ హత్నూర్‌, తాంసి, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో చలి తీవ్రస్థాయికి చేరింది. మంచుకొండలతో నిండి ఉన్న కశ్మీర్ లో చలి మరింత ఘోరంగా ఉంది. కార్గిల్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 15.8 డిగ్రీలకు పడిపోయాయి.  పంజాబ్‌, హరియాణాలనూ చలి పులి వణికిస్తోంది.  మహారాష్ట్రలోని ఉత్తర  ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. ఇంతగా వణికిస్తున్న చలికి బంగాళాఖాతంలో తుఫాన్‌, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులే ఇందుకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

Similar News