ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వివిధ పార్టీల్లోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు తమకు అనువైన పార్టీలలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జనసేన సైతం వలసలను ప్రోత్సహించింది. ఈ విషయంలో వైసీపీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఈసారి ఎలాగైనా టీడీపీని దెబ్బకొట్టాలన్న అభిప్రాయంలో ఉంది. అందులో భాగంగా టీడీపీలోని అసంతృప్తి నేతల్ని వైసీపీలో చేర్చుకుంటుంది. గత ఎన్నికల్లో పీలేరు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన ఇక్బాల్ అహ్మద్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతగా ఉంటూ 30 ఏళ్లుగా సేవలందించారు ఇక్బాల్. అయితే టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన అనుకుంటున్నారు. అందుకే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, అలాగే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లను కలిసి చర్చించారు. వారు ఆయన చేరికకు ఒకే చెప్పడంతో జగన్ సైతం పచ్చజెండా ఊపారు. దాంతో ఇక్బాల్ రేపు(శుక్రవారం) శ్రీకాకుళంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోకున్నారు.