సొంతపార్టీలో టికెట్ దక్కకపోవడంతో కొంతమంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. రాష్ట్రంలో లేని పార్టీలనుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వారిలో ముఖ్యంగా నిన్నమొన్నటివరకు టీఆర్‌ఎస్‌లో ఉండి చక్రం తిప్పిన మాజీమంత్రి గడ్డం వినోద్‌కుమార్ చెన్నూరు టికెట్ ఆశించారు. కానీ, ఆ టికెట్‌ను పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకుని.. ఢిల్లీ వెళ్లి ఆఖరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన బీఎస్పీ తరఫున బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.
ఆయన బాటలోనే నిలిచారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు.ఆయన కూడా షాద్‌నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే ముథోల్ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌నేత రామారావు పటేల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.
కోదాడకు చెందిన సినీనటుడు వేణుమాధవ్ చాలా ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీనుంచి పలుమార్లు టికెట్ ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నామినేషన్ వేశారు. ఆయన కూడా బీఎస్పీ లేదా సమాజ్ వాది పార్టీ తరుపున పోటీ చేస్తే మేలనే భావనలో ఉన్నారు.