తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ ముఖ్య పాత్ర పోషించారు. ఆమె ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి సోనియా గాంధీ తెలంగాణకు వస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలు ఆమెకోసం భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్ బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
ముందుగా అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తారు. అక్కడి నుంచి 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6గంటల కల్లా మేడ్చల్‌లోని బహిరంగ సభకు చేరుకుంటారు. సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగం చేయనున్నారు. రాహుల్ 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 116 పేజీల కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేయనున్నారు. అనంతరం ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ చేరనున్నారు. సోనియా గాంధీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పనున్నారు.