వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇప్పటికైనా మేల్కొని భారతిపై కేసు నమోదు చేయాలని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులను సంపాదించడానికి జగన్ కు ఆయుధంగా బ్రదర్ అనిల్ ఉపయోగపడ్డారని వర్ల గుర్తు చేశారు. భారతిపై ఈడీ కాకుండా సీబీఐ కూడా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. జగన్ 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారంటే ఏ మేర సంపాదించారో జనం అర్థం చేసుకుంటారన్నారు. వివిధ కేసుల్లో భారతి పాత్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కన్పించినప్పుడు సీబీఐకి ఎందుకు కన్పించడం లేదని వర్ల ప్రశ్నించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనిల్ శాస్త్రి వైఎస్ అల్లుడయ్యాక బ్రదర్ అనిల్ గా మారి కోట్లకు ఎలా పడగలెత్తారని వర్ల నిలదీశారు.