తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన రైతుబంధు పధకానికి ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించింది. దాంతో రబీ సీజన్‌కు రైతుబంధు చెక్కుల పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు. ఇవాళ నుంచి రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ పంపిణీ చేసేందుకు 9 బ్యాంకులు 52 లక్షల చెక్కులు ముద్రిస్తున్నాయి. ఇప్పటికే 11లక్షల చెక్కులను ముద్రించిన ఆయా బ్యాంకులు వ్యవసాయశాఖ అదికారులకు అందజేశారు. మిగతావి ఈనెల 8 నాటికి ముంద్రించి అందిస్తామని బ్యాంకులు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వం రద్దయి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రైతు బంధు చెక్కుల పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని తద్వారా చెక్కులను నిలిపివేయాలని ఈసీకి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీన్ని పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ రైతు బంధు పథకాన్ని పాత పథకంగానే భావిస్తూ చెక్కుల పంపిణీ చేసుకోవచ్చని చెప్పింది. రాజకీయ నేతలెవ్వరూ చెక్కుల పంపిణీలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. కేవలం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులే ఈ చెక్కులను అందించనున్నారు.