పొత్తుల్లో భాగంగా వరంగల్ జిల్లా జనగామ టికెట్ టీజేఎస్ కు కేటాయించడంతో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మనస్తాపానికి గురయ్యారు. మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాలకు కాంగ్రెస్ లో మంచి పేరుంది. అయితే జనగామ సీటును కోదండరాం కావాలని పట్టుబట్టడంతో కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని త్యాగం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అధిష్టానంపై అలకబూనిన పొన్నాలను బుజ్జగిస్తోంది కాంగ్రెస్.. ఆయన్ను సాధారణ ఎన్నిలకల్లో ఎంపీగా పోటీ చేయాలని కోరుతోంది. భుననగిరి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తామని హామీ ఇస్తోంది. ఐతే.. పొన్నాల మాత్రం ససేమీరా అంటున్నట్టు సమాచారం. అటు, కోదండరామ్ కూడా జనగామ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నా, కొన్ని సమీకరణాలు నెగిటివ్‌గా మారతాయేమోనని టెన్షన్ పడుతున్నారు. బీసీ సీటు లాక్కుని పోటీ చేశారన్న అపవాదు తనకు వస్తుందని కోదండరామ్ ఊగిసలాడుతున్నారు. మొదటగా కాంగ్రెస్ ఆయనకు 2 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదా జనగామ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించింది. ఈ రెండింటిలో జనగామ అయితేనే బెటర్ అని కోదండరామ్ కూడా భావిస్తున్నారు. అయితే కోదండరాం మాత్రం ఇప్పటివరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.