తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పెథాయ్ తుపాన్

Update: 2018-12-15 05:43 GMT

టిట్లీ బీభత్సాన్ని మరవకముందే కోస్తా తీరానికి మరో తుఫాన్‌ ముంచుకొస్తుంది. చెన్నైకి 870 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న పెథాయ్‌ మరింత బలపడింది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు దూసుకొస్తుందని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. 

తెలుగు రాష్ట్రాలను పెథాయ్ తుపాన్ వణికిస్తోంది. తీర ప్రాంత ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టిట్లీ బీభత్సాన్ని మరవకముందే పెథాయ్‌ పెనుముప్పుగా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను రేపు తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ నెల 17 న మధ్యాహ్నం ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. 

తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని 16, 17 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్‌ కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా వేటకు వెళ్లొద్దంటూ 50 వేల మంది మత్య్సకారులకు సందేశాలు పంపింది. 

కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లేట్లు, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్‌ శశిధర్‌ తీరప్రాంత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు కూడా పరిస్థిని సమీక్షించారు. తీరం వెంబడి అలల ఉధృతి పెరగడంతో జాలర్లు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లినవారిని వెంటనే తిరిగి రావాలని సందేశాలు పంపించారు. 

Similar News