జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్రాల తీరును తప్పుపట్టారు. ఏపీ ప్రజల్ని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీలు మోసం చేశాయని సూచించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం తాను పోరాటం చేసినప్పుడల్లా బీజేపీ బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని సూచించారు. కాబట్టే విభజన చట్టంలో హామీలు నెరవేర్చేలా కేంద్రం మొడలు వంచాలి. తాను కేంద్రంపై చేసే పోరాటం ఒక్కటే సరిపోదు. మీ అందరి మద్దతు కావాలి. తెలంగాణ ఉద్యమ స్పూర్తి తో పార్టీలకతీతంగా పోరాటం చేయాలి. అందుకు తగ్గ భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా. అంతేకాదు జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులను కలుపుకొని ఓ జేఏసీ ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటీ పీఎం మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఎన్డీఏ అజెండాలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. తాను ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ప్రశ్నిస్తే తక్షణమే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో మరోలా స్పందిస్తున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.
పార్లమెంట్ లో ఇచ్చిన హామీలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. హామీల అమలుపై ప్రశ్నించేందుకు జనసేన గొంతుక ఒక్కటే సరిపోదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక వేదిక రూపొందించాలని నిర్ణయించామని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బంద్‌లు నిర్వహించాలి. తప్పని పరిస్థితుల్లో శాంతియుతంగా నిర్వహించే బంద్‌లకు జనసేన మద్దతు ఉంటుంది’ అని పవన్ పేర్కొన్నారు.