ప్రధాని మోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందా ? భీమా-కొరెగావ్ కేసులో...పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన లేఖలో ఏముంది. రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే మోడీని హత్య చేయాలని మావోయిస్టులు ప్లాన్ వేశారా ? మోడీ హత్యతో విరసం నేత వరవరరావుకు లింకేంటీ ? మోడీ ప్రభ తగ్గిపోయినప్పుడల్లా....కొత్త కథలు అల్లుతారంటున్న కాంగ్రెస్ వ్యాఖ్యల్లో నిజమెంత ?
ప్రధాన మంత్రి నరేంద్ర హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయ్. భీమా-కొరెగావ్ హింస కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఓ లేఖను పరిశీలిస్తే ఔననే సమాధానం వస్తోంది. భీమా-కొరెగావ్ కేసులో అరెస్టయిన వారిలోని జాకబ్ విల్సన్ నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు. రాజీవ్ గాంధీ తరహాలోనే నరేంద్ర మోడీని...రోడ్ షోలో హత్య చేయాలని కుట్ర పన్నినట్లు లేఖలో ఉందన్నారు. జాకబ్ విల్సన్‌కు చెందిన లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూటర్ చెప్పారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం అరెస్టయిన ఐదుగురు నిందితులను ప్రశ్నించేందుకు పోలీస్ కస్టడీకి అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూణె కోర్టును కోరారు. పూణె పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో వరవరరావు పేరు ఉండటం సంచలనం రేపుతోంది. మోడీ హత్యకు నిధులు వరవరరావు సమకూరుస్తారని లేఖలో ఉండటం కలకలం రేపుతోంది. దీంతో వరవరరావును ప్రశ్నించేందుకు పూణె పోలీసులు రెడీ అవుతున్నారు.
నరేంద్ర మోడీని హత్య చేసేందేకు కుట్ర పన్నారన్న వార్తలపై...విరసం నేత వరవరరావు స్పందించారు. ఆదివాసీలు, దళితుల కోసం పోరాటం చేస్తున్న వారిని...అణచి వేసేందుకు తప్పుడు లేఖలు బయట పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల కోసం ప్రజాసంఘాలను అణచివేసేందుకు కేంద్రం పెద్ద కుట్ర పన్నిందని విమర్శించారు. మోడీ ఇమేజ్‌ను పెంచుకునేందుకు బీజేపీ కట్టకథలు అల్లుతోందన్నారు వరవరరావు
మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీపై విరుచుకుపడింది. బీజేపీ, మోడీ ప్రభ తగ్గిపోయినప్పుడల్లా కొత్త కొత్త కట్టు కథలు అల్లుతారని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో గుజరాత్ ఎన్నికల ముందు ప్రధాని గ్రాఫ్ తగ్గిపోవడంతో...పాకిస్తాన్‌తో కలిసి హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ మోడీ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.