మడకశిర ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా...నైతిక విజయం తమదే అంటున్న వైసీపీ

Update: 2018-12-15 06:06 GMT

అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి ఈరన్న అనర్హుడంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న పిటీషన్‌పై అనుకూల తీర్పు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

 సార్వత్రిక ఎన్నికలకు మరో 6 నెలల గడువు ఉన్న సమయంలో అనంతపురం తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేగింది. మడకశిర ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఈరన్న సమర్పించిన అఫిడివిట్ లో కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలతో పాటు తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే వివరాలను పొందుపర్చలేదని ఆయన నిబంధనలను ఉల్లంఘించారంటూ వైసీపీ తరపున పోటీ చేసిన తిప్పేస్వామి హైకోర్టు మెట్లెక్కారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు గత నెల 27 న ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేగా తిప్పేస్వామిని కొనసాగించాలని తీర్పులో పేర్కొంది. 

అయితే హైకోర్టు తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈరన్నకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో ఈరన్న రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే తాజా పరిణామాలతో వైసీపీలో జోష్‌ పెరిగింది. ఎన్నికల ముందు తమది నైతిక విజయం అని చెబుతున్నారు. తప్పుడు ధృవపత్రాలతో ఎన్నికైన వారిని తప్పించడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లైందని తిప్పేస్వామి చెబుతున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారాయి. ఇది టీడీపీకి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తూ ప్రతిపక్ష వైసీపీ ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటామని చెబుతోంది. 

Similar News