తొమ్మిది నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి అదే రోజు 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి సంచలనానికి తెరతీశారు గులాబీ బాస్ కేసీఆర్. కేవలం రెండు సీట్లకు మాత్రమే అభ్యర్థులను పెండింగ్ లో ఉంచి సుడిగాలి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రచార షెడ్యూలు ఖరారు చేశారు. ముందుగా 19 వ తేదీన ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఒకే సభను ఖమ్మం వేదికగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం తర్వాత జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ జరిగే సభలోనూ అయన పాల్గొంటున్నారు. ఆ మరుసటి రోజు 20వ తేదీ ఒంటిగంటకు సిద్దిపేట, దుబ్బాక కలిపి నిర్వహించే సభకు హజరవుతారు. అనంతరం రెండున్నరకు హుజురాబాద్, మూడున్నరకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించే ఉమ్మడి సభలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎల్లారెడ్డి సభలో పాల్గొంటారు.
21 న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ సభల్లో పాల్గొంటారు. 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, నిర్మల్, నిజామా బాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ సభల్లో, 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.