జనసేన ఆధ్వర్యంలో అనంతపురంలో ఇవాళ కరువు రైతు కవాతు జరగనుంది. ఈ కవాతు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు స్థానిక మార్కెట్ యార్డు నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ కవాతు నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రైతుల కోసం చేస్తున్న పోరాటాలకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు హాజరై కవాతును జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ నేతలు కోరారు. కరువు మండలాలుగా ప్రకటించినా ప్రభుత్వం ఇంత వరకూ సహాయక చర్యలు చేపట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో సమాధానం చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ అనంతపురం వేదికగా రాజకీయంగా కీలక నిర్ణయం వెల్లడిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో కదిరి నుంచి పోటీ చెయ్యాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లో తాను పోటీ చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్న క్రమంలో అనంతపురం నుంచి కూడా బరిలోకి దిగాలని జనసేన నేతలు పవన్ ను కోరుతున్నారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారో చూడాలి.