పెథాయ్‌ ఎఫెక్ట్‌: వేలాది ఎకరాల్లో పంట నష్టం

Update: 2018-12-18 07:22 GMT

పెథాయ్ తుపాను ప్రభావంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. పంట నష్టంపై త్వరితగతిన అంచనాలు ఇవ్వాలని అధికారులకు, మంత్రులు ఆదేశాలు జారీచేశారు. ధాన్యం సేకరణ మరింత ముమ్మరం చేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం అంబాజీపేట, మామిడికుదురు , అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తోంది. 

తుపాను ఎఫెక్ట్ తో కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ధాన్యం చాలా వరకు తడిసిపోయింది. తడిసిన బస్తాలను వేరే బస్తాల్లోకి మార్చి రవాణా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా 13చోట్ల  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

వరి రైతులకు పెథాయ్‌ తీరని నష్టాన్ని మిగిల్చింది. చివరి దశలో ఉన్న పంటపై తుపాను విరుచుకుపడింది. రాత్రి నుంచి జిల్లాలో కురుస్తోన్న వర్షాలకు వరిపంట పూర్తిగా నాశనమైంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, పెదపాడు, నరసాపురం, మొగల్తూరు, పెదవేగి, ఏలూరు గ్రామీణ మండలాల్లో పంట నీటమునిగింది. కోతకోసి పొలాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. తుపాను కారణంగా తీవ్రంగా నష్టోయామని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 35 వేలు నుంచి 40వేల వరకు తాము పెట్టుబడి పెట్టామని ఆ డబ్బులు చేతికి వస్తాయో, రాదో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పెథాయ్‌తో కృష్ణాజిల్లాలో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోసిన వరిపంటలు నీటమునిగాయి. రెండో పంటగా వేసిన మినుము మొలక దశలో ఉన్నాయి. ఈ పొలాలు నీట మునగడంతో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నూజివీడులో మొక్కజొన్న, పొగాకు, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగ్రంచిప్రోలు, తిరువూరులో పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది.
 

Similar News