రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతల్ని చేర్చుకుని బలంగా తయారవుతోంది. అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను సైతం నియమిస్తుంది. ఇప్పటికే తెనాలి, ముమ్మడివరం, పాడేరు నియోజకవర్గాలకు చెందిన నేతలకు టిక్కెట్లు సైతం ఎనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాపై దృష్టిపెట్టారు పవన్ కళ్యాణ్. ఆ జిల్లాలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గిద్దలూరు సీటును దక్కించుకుంది. ఇప్పుడు జనసేన కూడా గిద్దలూరు స్థానాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ నియోజకవర్గంలో రెడ్లు అధికంగా ఉన్నారు. ఆ తరువాత యాదవ, కాపు సామజికవర్గం ఓటర్లు ఉన్నారు. ఇక్కడినుంచి యాదవ సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని జనసేన భావిస్తున్నట్టు సమాచారం.
దాంతో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన చంద్రశేఖర్ యాదవ్.. జనసేన టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సీటు విషయమై పవన్ కళ్యాణ్ ను కలిశారు చంద్రశేఖర్. ఎలాగో యాదవ సామజికవర్గానికె టికెట్ ఇవ్వాలని అనుకున్నాం కనుక చంద్రశేఖర్ కే టికెట్ ఇవ్వాలని పవన్ కూడా భావిస్తున్నారట. కాగా ఒంగోలులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయం కూడా చంద్రశేఖర్ స్థలంలోనే ఉంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరును కూడా పరిశీలించింది జనసేన.. కానీ ఆయన జనసేన వైపు అంతగా ఆసక్తి కనబరచలేదు. దాంతో చంద్రశేఖర్ అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేయాలనీ ఆ పార్టీ అనుకుంటోదట.. మరి ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందో చూడాలి.