రైతు భిక్షాటన...లంచమివ్వాలి.. దానం చేయండి ప్లీజ్‌!

Update: 2018-12-21 06:15 GMT

సమస్యలపై రకరకాల నిరసనలు ఆందోళనలు చేయడం అందరు చూసే ఉంటారు కానీ ఓ రైతు కడుపు కాలి కుటుంబ సభ్యులతో కలిసి వినూత్న ప్రదర్శనకు దిగాడు. భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. బస్టాండ్ ఆటో స్టాండ్ హోటళ్ల వద్ద ధర్మం చేయండంటూ వేడుకుంటున్నాడు.  

కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు మన్యం వెంకటేశ్వర్లు 25 ఎకరాల భూమికి యజమాని. రెవెన్యూ అధికారుల లంచగొండి తనంతో తన భూమి కబ్జాకు గురైందని ఆరోపించారు. ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదంటూ ‘అధికారులకు లంచం ఇవ్వాలి- ధర్మం చేయండి’ అంటూ ఓ బ్యానర్ కట్టి భార్య, ఇద్దరు పిల్లలతో కలసి వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్నాడు.

వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తున్నాడు వెంకటేశ్వర్లు. ఆ భూమి తనదే అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నాడు. పొలం పేపర్లు తాకట్టు పెట్టి గతంలో రుణం కూడా తీసుకున్నానని తెలిపాడు. అధికారుల తీరును ఎండగట్టేందుకే భిక్షాటన మొదలు పెట్టానంటున్నాడు వెంకటేశ్వర్లు. అధికారుల పనితీరుతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

మరో వైపు రైతు వెంకటేశ్వర్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు అధికారులు. పాత అడంగల్ అడ్డుపెట్టుకొని అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రికార్డుల ఉన్న విధంగా పాస్ పుస్తకాలు మంజూరు చేశామని చెప్పారు. ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించుకోవచ్చని సూచించారు. రైతు వెంకటేశ్వర్లు ఆరోపణల్లో నిజానిజాలు ఏమున్నప్పటికీ ..అధికారుల తీరుపై అంతా మండిపడుతున్నారు. 

Similar News