వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

Update: 2018-06-12 07:22 GMT

మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. వాజ్‌పేయి చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ ఆస్పత్రి మెడికల్ అండ్ ప్రోటోకాల్ డివిజన్ చైర్ పర్సన్ డాక్టర్ ఆర్తి విజ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఇన్‌ఫెక్షన్ తగ్గేవరకూ వాజ్‌పేయి ఆస్పత్రిలోనే ఉంటారని ఆయన చెప్పారు. నిన్న ఉదయం వాజ్‌పేయి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంతోకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం, రొటీన్‌ చెకప్‌ కోసమే ఆయనను ఆస్పత్రికి తరలించారని బీజేపీ చెబుతున్నప్పటికీ- వాజపేయి దీర్ఘకాల అస్వస్థత దృష్ట్యా ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, వాజపేయి రాజకీయ సహచరుడు అద్వానీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సుష్మా స్వరాజ్‌.. తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మోడీ ఆస్పత్రిలోనే దాదాపు గంటసేపు ఉన్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలో డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది.

Similar News