వణికించిన పెథాయ్‌...తప్పిన పెథాయ్‌ ముప్పు

Update: 2018-12-18 05:49 GMT

గండం గడిచింది. కోస్తా ప్రాంతానికి పెను ముప్పు తప్పింది. తీవ్ర తుపానుగా మారి రాష్ట్రంపై కత్తిదూసిన పెథాయ్‌ భారీ విధ్వంసానికి దిగకుండా శాంతించింది. క్రమంగా బలహీనపడి ఒడిశా దిశగా పయనించింది. అయితే, పెథాయ్ చేసిన గాయం నుంచి ప్రజలు క్రమంగా కోలుకుంటున్నారు. ముఖ్యంగా తీరాన్ని తాకే సమయంలో తీరం వెంబడి దాదాపు 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. జనంలో వణుకు పుట్టించాయి. చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, ప్రజల అవగాహనతో ప్రాణ నష్టం లేకుండా రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయంనగరంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

పెథాయ్‌ తుపాను ప్రభావం తూర్పు గోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా నిన్న సాయంత్రం నుంచి కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. అమలాపురం డివిజన్‌లోని 16 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 32 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం ఆత్రేయపురం మండలంలో నమోదయ్యింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పోలాలు చెరువులను తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, విశాఖ విజయనగరం జిల్లాల్లో తీరప్రాంత ప్రజలు ఇంకా పునరావస కేంద్రాల్లో ఉన్నారు. 

పెథాయ్ సాగరంలో ఉన్నప్పుడున్న తీవ్రత, తీరం దాటిన తరువాత లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. నష్టతీవ్రత కూడా తగ్గింది. దీంతో కోనసీమవాసులతో పాటు ఉభయగోదావరి జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తుఫాను ప్రభావం భారీస్థాయిలో లేకయినా  ప్రాథమిక అంచనాల ప్రకారం 50 కోట్ల వరకూ నష్టాన్ని మిగిల్చింది. పైలీన్, హుద్‌హుద్, తిత్లీ, గజ తుపాన్లతో పోలిస్తే, పెథాయ్‌ తీవ్రత బాగా తక్కువగానే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రహదారులపై పడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేశారు. పునరావాస శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విద్యుత్‌ సరఫరాకు జనరేటర్లను ఏర్పాటు చేశారు.

Similar News