తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పుటికే ప్రచారాన్ని ప్రారంభించి కొంతమంది అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఆమోదం కోసం ఢిల్లీకి పంపింది. ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా.. మ్యానిఫెస్టో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మ్యానిఫెస్టో కమిటీ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మ్యానిఫెస్టో రూపకల్పనను పూర్తి చేసినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. భక్తచరణ్ దాస్ నేతృత్వంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల అభ్యర్ధనను పరిశీలిస్తుంది. మొదటి దఫాలో రాష్ట్రంలో నాలుగు రోజులు మకాం వేసి.. మొదటి విడత అభ్యర్థుల స్క్రూటినీ చేసింది. శుక్రవారం రెండో దఫా రాష్ట్రానికి వచ్చిన స్క్రీనింగ్ కమీటీ.. అభ్యర్థుల వడపోతను పూర్తిచేసినట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుంది స్క్రీనింగ్ కమిటీ.. ఏఐసీసీ చేసిన సర్వే రిపోర్ట్ తో పాటు.. స్థానికంగా అభ్యర్థుల బలాబలాలు.. ఆయా నియోజకవర్గాల్లోఎవరైతే బాగుంటుందనే విధంగా సర్వే చేసి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక అభ్యర్థుల తుది జాబితాను నవంబర్ ఒకటవ తేదీన ప్రకటించేందుకు రెడీ అయినట్టు సమాచారం.