ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ మంత్రి, ఆ తరువాత కొన్ని పరిణామాల రీత్యా ఆ పార్టీ నుంచి బహిష్కరింపబడ్డారు. అయితే కొంతకాలంపాటు కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తుందని ఆశించాడు కానీ అటువైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో కారెక్కేందుకు రెడీ అయ్యాడు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు. కాంగ్రెస్‌లో చేరడం కోసం ఇప్పటివరకు నిరీక్షించిన ప్రసాదరావుకు చేరికపై అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే అయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిడమర్తి రవి తదితర టీఆర్ఎస్ నేతలు ప్రసాద్ రావు తో భేటీ అయ్యారు. దాంతో నిన్న(గురువారం) ఆయన తన అనుచరులతో భేటీ కావడంతో టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆయనతో ఫోనులో మాట్లాడినట్టు తెలుస్తోంది. అనుచరుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని, తనకు కొంత సమయం కావాలని కేటీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా టీఆర్ఎస్ లో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా జలగం పని చేశారన్న కారణంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. ఆ గడువు 2005లోనే తీరిపోయినా.. అయన మాత్రం తిరిగి కాంగ్రెస్ లో చేరడానికి సుముఖత చూపకపోవడం.. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగానే వుంటూ వస్తున్నారు. దాంతో సత్తుపల్లిలో బలమైన క్యాడర్ కలిగి ఉన్న జలగం కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.